హైదరాబాద్: ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ విజయవాడ ఎంపీ ల(జ)గడపాటి రాజగోపాల్ తరుచూ వార్తల్లో ఉంటున్నారు. లగడపాటి కాస్త జగడపాటిగా, రగడపాటిగా మారుతున్నారు. తాజాగా మెడికల్ సీట్లకు సంబంధించి ఏకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాసి మరోమారు రాజకీయాలు తనచుట్టూ తిప్పుకునే విధంగా చేసుకున్నారు. లగడపాటి మొదటి నుంచీ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.
తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం...వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తెలంగాణ గురించి మాట్లాడి సీమాంధ్ర ప్రజల నుంచి కొంత వరకు మద్దతును కూడబెట్టుకునే విషయంలో రాజగోపాల్ సక్సెస్ అయ్యారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సీమాంధ్రకంటే తెలంగాణలోనే మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్నాయనీ, దీనిపై తాను కేసీఆర్ తో కూడా చర్చకు సిద్దమంటూ బహిరంగ లేఖను రాశారు. అంతటితో ఆగకుండా లెఖ్కలతో సహా నిరూపించకుంటే తాను ఎంపీ పదవీకి రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నట్లు లేఖలో సవాల్ విసిరారు. ఇప్పుడు ఆ లేఖ సంచలనంరేపుతోంది.
రాజగోపాల్ లేఖపై టీఆర్ఎస్, తెలంగాణ వాదులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాజగోపాల్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, రామారావు తీవ్రంగా ఖండించారు. రాజగోపాల్కు కేసీఆర్ తో చర్చించేంత స్థాయి లేదని అన్నారు. రాజగోపాల్ నోటిని అదుపులో పెట్టుకుంటే బాగుంటుందనీ, లేకపోతే మరోమారు గుణపాఠం చెప్పాల్సి వస్తుందనీ హెచ్చరించారు. టీ-న్యాయవాదులు మరో అడుగు ముందుకేసీ మెడికల్ సీట్లపై తప్పుడు ప్రకటనలు చేస్తూ అందర్నీ తప్పుదోవపట్టించే విధంగా వ్యవహారిస్తున్న రాజగోపాల్ తన వైఖరిని మార్చుకోవాలంటూ ఇంటిని ముట్టడించారు.
తెలంగాణ విషయంలో రాజగోపాల్ మొదటి నుంచీ తప్పుగా వ్యవహారిస్తున్నారనీ, ఎన్నిమార్లు హెచ్చరించినా పద్దతిని మార్చుకోవడం లేదనీ, ఇక మీదట ఇలాగే ఉంటే గుండుగీయిస్తామనీ ఈ దఫా వారు కాస్త గట్టిగానే హెచ్చరించారు. తెలంగాణ విషయంలో రాజగోపాల్ చేస్తున్న వ్యాఖ్యలతో మళ్లీ రాజకీయం కొంత ఉద్రిక్తతగా మారింది. తెలంగాణవాదులు రెచ్చిపోయే విధంగా రాజగోపాల్ వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. దీనితో సీమాంధ్రలో రాజగోపాల్కు సానుభూతి వచ్చి ఉండవచ్చు. కానీ, పబ్లిసిటి కోసం, రాజకీయమంతా తనచుట్టే తిరిగే విధంగా చేసుకోవడానికి ఆయన ఇలాంటి డ్రామాలు ఆడుతున్నట్లు అనేక పరిణామాలు రుజువు చేశాయి.
అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మెడికల్ సీట్ల వ్యవహారంతో రాజగోపాల్ మీడియాలో బోలెడంత ప్రచారాన్ని పొందారు. ఇది ఎల్లకాలం పనిచేస్తుందనీ కూడా మనం చెప్పలేం. మొత్తానికి రాజగోపాల్ మాత్రం ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నారు. తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నట్లు అగుపిస్తోంది.
ఫలితంగా తెలంగాణ ఉద్యమం చల్లారిపోకుండా రాజగోపాల్ పరోక్షంగా ఉపయోగపడుతున్నాడనీ చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా రాజకీయ నాయకులు తమ పబ్లిసిటి కోసం సున్నితమైన తెలం‘గానం’ కదపడం వల్ల ఆవేశకావేశాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. నాయకులు కాస్త ఆ దిశగా ఆలోచన చేసి మాట్లాడితే అందరికీ మంచిగా ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: