గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన కామ్రెడ్లు కయ్యానికి దిగుతున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల మధ్యన మాటల యుద్ధం పెరిగిపోతోంది. గతంలో కలిసి పనిచేసిన రాజకీయ పార్టీలన్నీ బూర్జువా పార్టీలయ్యాయని సీపీఎం ఆరోపిస్తుండగా సీపీఐ మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించడంలేదు. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీచేద్దామని సీపీఎం నాయకులు రాఘవులు, సీపీఐ నాయకులు నారాయణకు బహిరంగ లేఖ రాశారు. ఇందుకు స్పందించిన నారాయణ ప్రజాసమస్యలను వదిలిపెట్టి ఎన్నికలపై ద్రుష్టిసారించడం ఎందుకని ఎదురుదాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ, సీపీఎం పార్టీల ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఏపార్టీతో పొత్తు కుదుర్చుకోకుండా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను గెలుపొందడం అంతసులభం కాదు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే కామ్రెడ్లకు పట్టుసన్నగిల్లిందనే చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితిలో స్థానిక సంస్థల్లో సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తే కొంత బలంగా ఉంటుందని సీపీఎం భావించి లేఖ రాసి ఉండవచ్చుగాని అందుకు సీపీఐ సిద్ధంగా లేదని నారాయణ మాటలను బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహాకూటమిలో సీపీఐ, సీపీఎం కలిసి పనిచేసినప్పటికినీ సీపీఎం తెదేపాకు కొంత దూరమయినట్లు పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అయితే సీపీఐ మాత్రం తెదేపాతో కలిసి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తొంది. ఈవిషయాలను బట్టి భవిష్యత్తులో సీపీఐ తెదేపాతో కలిసి పనిచేస్తుండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కామ్రెడ్ల మధ్య మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందా మరింత రచ్చకెక్కుతుందా వేచిచూడాల్సిందే.....
మరింత సమాచారం తెలుసుకోండి: