అటు 90కోట్ల లొల్లి; ఇటు 108పై రగడ

 హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టామిట్టాడుతోంది. కేంద్ర కాంగ్రెస్ను 90కోట్ల రూపాయలు వెంటాడుతుంటే...రాష్ర్ట కాంగ్రెస్ అత్యవసర సేవల్ని అందించే 108పై ప్రజలే కాకుండా, సంబంధిత మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి కూడా పెదవి విరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా సోనియాను లక్ష్యంగా చేసుకుని జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడూ సంచలన ఆరోపణలు చేస్తుంటాడు. కానీ, ఈ దఫా మరో అడుగు ముందుకేసీ ఏకంగా కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖాస్త్రాన్ని సంధించారు. అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏజేపీఎల్)కు 90 కోట్ల రుణం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ చట్టాలను ఉల్లంఘించిందనీ, ఇది ఎన్నికల చట్టం, ఆదాయపన్ను చట్టాలకు విరుద్ధమైనందున కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సిందిగా స్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ 90కోట్ల రూపాయలకు సంబంధించిన దానిపై చర్చ కొనసాగుతోంది. గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన ఏజేపీఎల్‌ కు కాంగ్రెస్ 90 కోట్ల వడ్డీ లేని రుణమిచ్చింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమనేది స్వామి ప్రధాన ఆరోపణ. ఆదాయపన్ను చట్టం ప్రకారం పార్టీలు.. వాణిజ్య అవసరాల కోసం ప్రైవేటు సంస్థలకు రుణాలివ్వరాదనీ స్వామి అంటున్నారు.  ఏజీపీఎల్కు రుణమిచ్చిన సంగతిని స్వయంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది ఒప్పుకున్నారు. దీనితో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడ్డది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు రుణమిచ్చినందుకు చారిటబుల్ సంస్థ కింద నమోదైన భారత క్రికెట్ బోర్డు కు భారీ జరిమానా విధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామి లేఖ నేపథ్యంలో బీజేపీ కూడా కాంగ్రెస్‌పై విమర్శల దాడిని మరింత పెంచింది. సుబ్రహ్మణ్యస్వామి లేఖపై ఈ రోజు రాంలీలా మైదానంలో జరిగే కాంగ్రెస్ బహరంగ సభలో కాంగ్రెస్ పెద్దలు ఏం చెబుతారో చూడాలి. ఇక, రాష్ర్ట విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడటానికి 108 సర్వీసును ప్రారంభించారు.  అది కాస్త ఇప్పుడు నిధులలేమితో బాధపడుతుంది. తాజాగా టీడీపీ నేత ఎర్రన్నాయుడు దుర్మరణంతో 108పై రాష్ర్ట వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చసాగుతోంది. సమయానికి 108 వచ్చి, ఆక్సిజన్ అంది ఉంటే ఎర్రన్నాయుడు బతికి ఉండేవారనీ రాష్ర్ట వ్యాప్తంగా కొత్త వాదన తెరపైకి వచ్చింది. దీనికి మద్దతుగా ఆ శాఖ మంత్రి రవీంద్రారెడ్డి కూడా 108పై పెదవి విరిచారు. 108కు కావల్సిన నిధులు విడుదల చేయడం లేదనీ, 108లో కనీస సౌకర్యాలు లేవంటున్నారు. ఇది ప్రతిపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్లు అయ్యింది. మొత్తానికి 108పై రాష్ర్ట వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. 2009ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో‘సారీ’ అధికారంలోకి రావడానికి 108 కూడా ఒక కారణం. అటువంటి స్కీంను నీరుగారుస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కేంద్రాన్ని 90కోట్ల వడ్డీలేని రుణం పట్టిపీడిస్తుంటే....రాష్ర్టానికి 108 తలనొప్పిగా మారింది.               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: