పుర పోరు: ఏపీలో ఈ నెల 14న లగేజీ సర్దేస్తోన్న పార్టీ ?
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు రాష్ట్రానికి ఏడేళ్లుగా బీజేపీ చేస్తున్న అన్యాయాలతో ఏపీ ప్రజలు విసిగి విసిగి పోయి ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో అడుగడుగునా అడ్డు పడుతోన్న బీజేపీకి.. ఏపీకి చేసే మేళ్లు లేకపోగా.. ఏపీలో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు లాగేసుకోవడమో లేదా నాశనం చేయడమో జరుగుతోంది.
రాజధాని అమరావతి గురించి కేంద్రం ఏనాడు పట్టించుకోదు.. పోలవరం అతీ గతీ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం రాష్ట్రంలో బీజేపీకి శరాఘాతంగా మారింది. 2019 లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే అనేక మంది టీడీపీ నేతలు బీజేపీ లో చేరిపోయారు. ఆ తర్వాత కూడా ఎంతో మంది తమ స్వలాభం కోసం లేదా పదవులు ఆశించో ఆ పార్టీలో చేరినా ఆ పార్టీకి ఓట్ల పరంగా ఒరిగింది లేదు.
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నబీజేపీ నాయకుల్లో చాలా మంది.. రేపు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చూశాక చాప చుట్టేసే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క కార్పొరేషన్లో.. మున్సిపాల్టీయో కాదు... కార్పొరేటర్, కౌన్సెలర్ సీటు గెలిచినా గొప్పే.. బీజేపీపై ఏపీ జనాలు అంతలా విసిగిపోయి ఉన్నారు. ఇక జమిలి ఎన్నికలు వస్తే 2022లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. బీజేపీలో ఉండి చేసేదేమీ ఉండదు. అందుకే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరి తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదేమైనా ఈ నెల 14 తర్వాత పరిణామాలతో ఏపీలో బీజేపీ పతనం ప్రారంభమైనట్టే అంటున్నారు.