పుర పోరు: మదనపల్లెలో కార్పొరేషన్ పీఠం ఆమెదే.. పోల్స్ అదే చెప్తున్నాయా?

Satvika
చిత్తూరు జిల్లాలో పుర పాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి.. ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఉదయాన్నే ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి చేరుకున్నారు..దాదాపుగా మధ్యాహ్నం ఒకటికి పోలింగ్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, చిత్తూరు మదనపల్లె ఎన్నికలు కీలకంగా మారాయి. పురపోరులో మహిళల పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే ఓటర్లుగా వారే ఎక్కువగా ఉన్నారు. ఛైర్‌పర్సన్లుగా చాలాచోట్ల ఎన్నికకానున్నారు. పలమనేరు పురపాలక సంఘంలో వరుసగా మహిళలే ఛైర్‌పర్సన్లుగా ఎన్నికవుతుండగా.. మదనపల్లెలో తొలిసారిగా మహిళకు రిజర్వు అయ్యింది.


పలమనేరు పంచాయతీ 2005లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. పాత పంచాయతీ భవనంలోనే దీనిని కొనసాగించారు. మొదటిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. మహిళలకే కేటాయించడంతో తొలి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన నాగమణికపర్థి ఎన్నికయ్యారు.2014లో ఎన్నికలు నిర్వహించగా.. రెండో దఫా కూడా మహిళలకే రిజర్వేషన్‌ కావడంతో వైకాపాకు చెందిన శారద ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పాలకవర్గం 2019 మార్చి నెలాఖరుకు వరకు కొనసాగింది. అప్పట్నుంచి ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగింది.


ప్రస్తుతం మూడోసారి జరగనున్న ఎన్నికల్లో బీసీ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం వైకాపా అభ్యర్థులు 18 వార్డుల్లో ఏకగ్రీవం కాగా.. ఇందులో 9 వార్డుల్లో మహిళలు ఉన్నారు. మరో 8 వార్డుల్లో వైకాపా, తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండి గట్టి పోటీని ఇస్తున్నారు.2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి తెదేపా అభ్యర్థి కొడవలి శివప్రసాద్‌ మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ సారి ఛైర్మన్‌ పదవి మహిళను వరించనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పట్టణంలో 35 వార్డులుంటే 18 మహిళలకు రిజర్వేషన్‌ అయ్యాయి. 15 వార్డులు ఏకగ్రీవం కాగా అందులో 9 మంది మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవమయ్యారు..మొదటిసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఇచ్చిన నేపథ్యంలో గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఆమెకే పదవి దక్కుతుందని అభిప్రాయ పడుతున్నారు.. మరి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: