కుప్పం ప్రజల ముందు తప్పు ఒప్పుకున్న చంద్రబాబు..?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో తెలుగు దేశం  ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. తన తప్పు ఒప్పుకున్నారు. కుప్పం ప్రజలను తాను సరిగ్గా పట్టించుకోలేదని అంగీకరించారు. పుంగనూరు మహానేత ఒకరు కుప్పంలో అలజడికి ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు.  
కుప్పంలో తనను ఓడించేందుకు పంచాయతీ ఎన్నికల్లో 50కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పాన్ని మరో పులివెందులలా, పుంగనూరు లా మార్చాలి అనుకున్నారని చంద్రబాబు అంటున్నారు. తానుండగా కుప్పాన్ని ఎవరూ ఏం చేయలేరన్న చంద్రబాబు..  జే ట్యాక్స్ కోసం ఊరు పేరు లేని మద్యం తెస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో లాంటి అధికారులు ఎన్నికల సమయంలో ఏం చేసారో చూశానని.. తాము అధికారంలోకి వచ్చాక అధికారుల పనితీరు పై సమీక్ష ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నులు మీద పన్నులు బాదుతోందన్న చంద్రబాబు.. టాయిలెట్ కు వెళ్లినా పన్నులు వేసే రోజులు వస్తాయేమోనంటూ సెటైర్లు వేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడుపల్లె, కుప్పంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ.. పొరపాటు జరిగింది.. మీరు ఎన్నో త్యాగాలు చేశారు.. మీకోసం ఆలోచించి ఉంటే బాగుండేది.. మిమ్మల్ని విస్మరించా..  ఇకపై మీ కోసం 25% సమయం కేటాయిస్తా..  మీరంతా చెప్పినట్లు వింటా.. అంటూ  హామీ ఇచ్చారు.
తాను రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు పనిచేశానని, అయితే కార్యకర్తల కోసం సమయం కేటాయించలేకపోయానని  ఒప్పుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేశారని, నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చోటా మోటా నాయకులు ఎగిరి పడుతున్నారని, చిన్న కాలువను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాను పులివెందులకు నీళ్లిస్తే అక్కడ ప్రజలు తనకు ఓటు వేశారన్నారు. ఈ ప్రభుత్వం కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: