ఆ టీకా జోలికి వెళ్లారో అంతే..!

NAGARJUNA NAKKA
ఏదైనా ప్రొడక్టు ఓసారి చైనాకు వెళ్లిందంటే చాలు... దాని నకలు తయారుచేసి అమ్మేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఫలితంగా ఆదేశం నకిలీ ప్రొడక్టుల తయారీ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంభకోణం బట్టబయలైంది.

నకిలీలు, చౌకబారు వస్తువుల ఉత్పత్తికి చైనా పెట్టింది పేరు. ఇక కోవిడ్ వైరస్ సైతం అక్కడే పుట్టిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్యసంస్థ.. వుహాన్‌లో పరిశోధనలు సైతం నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంభకోణానికి సూత్రధారి కూడా ఆ దేశంలోనే చిక్కాడు.

కాంగ్‌ అనే పేరున్న ఈ ఘరానా మోసగాడు.. నిజమైన వ్యాక్సిన్ల ప్యాకేజింగ్‌, డిజైన్లను బాగా పరిశోధించాడు. తర్వాత  ఏకంగా 58 వేల నకిలీ టీకా సమ్మేళనాలను సృష్టించాడు. టీకా ఔషధానికి బదులుగా మినరల్‌ వాటర్‌, సెలైన్‌ ద్రావణం ఆ సీసాల్లో నింపేవాడట. వీటిని సముద్రమార్గంలో విదేశాలకు స్మగ్లింగ్ చేసేవాడు. గత ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నట్లు సమాచారం. గత నవంబర్‌లో 600 బ్యాచ్‌ల నకిలీ వ్యాక్సిన్‌ను హాంకాంగ్‌కు పంపాడు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్‌ బృందం ...2.78 మిలియన్ డాలర్లు ఆర్జించింది.

ఈ నకిలీ టీకాలను ఆస్పత్రులకు అత్యధిక ధరలకు విక్రయించేవారు కాంగ్ గ్రూప్.  వీటిని చేజిక్కించుకున్న కొంతమంది, తామే స్వయంగా టీకా కార్యక్రమాలను నిర్వహించేశారు. మరి కొందరు గ్రామీణ డాక్టర్లు, ఈ నకిలీ వ్యాక్సిన్లను... ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అందచేసి డబ్బు చేసుకున్నారు.నకిలీ టీకాలకు సంబంధించిన నేరాలకు గానూ చైనాలో ఇప్పటికి 70 మందికి పైగా అరెస్టయ్యారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలంటూ.. చైనా అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి చైనా టీకా విషయంలో దారుణంగా వ్యవహరిస్తోంది. నకిలీ టీకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మరి దీనికి అడ్డుకట్ట ఎలా పడుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: