గ్రేటర్ విశాఖ వార్: మొత్తం తిప్పేశారు...వైసీపీ జెండా ఎగురుతుందా?
ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలోనే పంచాయితీ పోరు తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ మొదలు కానుందని తెలుస్తోంది. అందుకనే అధికార వైసీపీ, ఈ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కీలకంగా ఉన్న గ్రేటర్ విశాఖ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ ఎప్పటినుంచో చూస్తుంది.
పైగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న ప్రాంతం. దీంతో గ్రేటర్ పీఠంలో సత్తా చాటాలని విజయసాయిరెడ్డి ముందస్తు వ్యూహాలతో రెడీ అవుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోకి వచ్చే అన్నీ నియోజకవర్గాల వైసీపీ నేతలతో వరుసపెట్టి సమావేశమవుతున్నారు. అలాగే భీమిలి నియోజకవర్గానికి మాజీ మంత్రి పి.బాలరాజు, విశాఖ తూర్పుకు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, దక్షిణ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఉత్తరం నియోజకవర్గానికి కాయల వెంకటరెడ్డి, పశ్చిమ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్, పెందుర్తి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డిని పరిశీలకులుగా ఎంపిక చేశారు.
గ్రేటర్ విశాఖ పీఠం గెలవడమే లక్ష్యంగా విజయసాయి పావులు కదుపుతున్నారు. 98 వార్డుల్లో మెజారిటీ వార్డులు గెలిచి గ్రేటర్‌లో అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుత పరిస్తితిల్లో ఇక్కడ టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అధికారం ఉంది కాబట్టి వైసీపీ విజయానికి ఎలాంటి ఢోకా లేకపోవచ్చు. పైగా విజయసాయి విశాఖ రాజకీయాన్ని తమకు అనుకూలంగా తిప్పేసుకున్నారు. మొత్తానికైతే గ్రేటర్ విశాఖలో వైసీపీ జెండా ఎగిరేలాగానే ఉంది.