జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే
పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ ఏకగ్రీవాలకోసం కృషిచేయాలని నాయకులకు సూచించారు. ఆయన ఆదేశాలతోనే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలకోసం కష్టపడుతున్నారు. ఇటీవల ఇదే విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి సహా.. ఇతర సీనియర్ మంత్రులు సైతం నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నారు. ఏకగ్రీవాలకోసం కృషి చేయాలని హితవు పలికారు. అయితే అవేవీ పట్టించుకోనట్టే ఉన్నారట ఓ సీనియర్ ఎమ్మెల్యే.
సహజంగా గ్రామాల్లో ఎవరు నామినేషన్ వేయాలి, ఎవరు డమ్మీ క్యాండిడేట్.. అధికార పార్టీ నాయకుల్లోనే గొడవలు వస్తే ఏం చేయాలనే విషయాలను ఎమ్మెల్యేకి చేరవేస్తుంటారు మండల స్థాయి నాయకులు. చివరిగా ఎమ్మెల్యే అంగీకారంతోనే అభ్యర్థులు ఫైనల్ అవుతారు. కానీ నెల్లూరు జిల్లాలోని సదరు ఎమ్మెల్యే మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నారట. పంచాయతీ ఎన్నికలకోసం తన వద్దకు వస్తున్న నేతలకి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదట. గ్రామాల్లో వైసీపీ నాయకుల మధ్య మనస్పర్థలు వచ్చినా పట్టించుకోలేదట. కొంతకాలంగా జగన్ పై గుర్రుగా ఉన్న సదరు ఎమ్మెల్యే.. పంచాయతీ ఎన్నికలను పూర్తిగా పక్కనపెట్టేశారని సమాచారం. జిల్లాలో దాదాపు అన్నిచోట్ల ఏకగ్రీవాలకోసం నేతలు పోటీ పడుతుంటే.. ఆయన నియోజకవర్గంలో మాత్రం ఏకగ్రీవాల ఊసే లేదని తెలుస్తోంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తొలిరోజు మంగళవారం కావడంతో ఎవరూ పెద్దగా నామినేషన్లు వేయడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. మిగిలిన రెండు రోజుల్ల భారీగా నామినేషన్లు పడతాయని అంటున్నారు. అటు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో పంచాయతీ రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.