భారతీయులకు గుడ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
దేశంలో.. ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పాతిక లక్షల మందికిపైగా భారతీయులకు టీకా ఇచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కొనసాగుతోందని వెల్లడించింది.
భారత్ చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా టీకా ఇచ్చామని ప్రకటించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ సమయంలో  ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు అధికారులు వెల్లడించారు. పది లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు భారత్‌కు 6 రోజుల సమయం పడితే.. అమెరికాకు 10 రోజులు, స్పెయిన్‌కు 12, ఇజ్రాయెల్‌కు 14, బ్రిటన్‌కు 18, ఇటలీకి 19, జర్మనీకి 20, యూఏఈకి 27 రోజుల సమయం పట్టిందని వివరించారు.
వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్య సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్‌, ఒడిశా, హరియాణా, అండమాన్‌ నికోబార్‌దీవులు, రాజస్థాన్‌, త్రిపుర, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని  అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల్లో తగ్గుదల కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇప్పుడు మొత్తం లక్షా 73 వేల 740 యాక్టివ్‌ కేసులు ఉండగా... వీటిలో కేరళలో 72 వేల 476, మహారాష్ట్రలో 44 వేల 624 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని... ఈ రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం బాధితులు ఉన్నారని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా మరణాలు కూడా 125కన్నా తక్కువే ఉన్నాయని... ఇది 8 నెలల తర్వాత అతి తక్కువ అని పేర్కొంది. మొత్తం బాధితుల్లో 96.94 శాతం మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా... లక్షా 53 వేల 847 మంది వైరస్‌కు బలయ్యారని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: