అంతా అయిపోయాక.. అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్‌ కాల్..?

Chakravarthi Kalyan
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి అఖిలప్రియకు ఫోన్ చేసి పరామర్శించారు. అఖిలప్రియ శనివారం చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు ఆమెకు ఫోన్‌ చేశారట.  ధైర్యంగా ఉండాలంటూ పరామర్శించారట.  ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని.  మనం ధైర్యంగా ఉంటూ తోటివారికి ధైర్యం చెప్పాలని అఖిల ప్రియతో చంద్రబాబు అన్నట్టు తెలిసింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చంద్రబాబు అఖిలప్రియకు చెప్పారట.

అఖిల ప్రియ చంద్రబాబు కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ ఆమె ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. అఖిల ప్రియను బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఆమె గురించి మాట్లాడిన పాపాన పోలేదు. ఏదో లోకేశ్‌ ఒక కామెంట్ చేయడం తప్పించి.. ఆమె ఊసే పార్టీలో ఎత్తలేదు.

బహుశా.. ఆమెకు సపోర్టుగా మాట్లాడితే పార్టీకి చెడు పేరు వస్తుందని భావించారో ఏమో తెలియదు. ఆమె విడుదలయ్యాక మాత్రం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆమెకు బెయిల్ వస్తుందా.. రాదా అన్న విషయంపై చాలా ఉత్కంఠ ఉండేది.  బెయిల్ రాకపోతే.. ఆమె ఇంకా కొద్దికాలంపాటు చంచల్ గూడా జైల్లో మగ్గక తప్పదేమో అనుకున్నారు. మొత్తానికి బెయిల్ వచ్చింది. ఇక ఇప్పటికే పరారీలో ఉన్న భార్గవ్‌ రామ్‌.. బెయిల్ వస్తే  తప్ప అజ్ఞాతం వీడే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడంలేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్‌ రెడ్డి కూడా  చిక్కులు ఎదుర్కొంటున్నారు.

మొత్తానికి రాజకీయ కుటుంబం అయి ఉండీ.. మాజీ మంత్రి అయి ఉండీ.. ఆమె జైల్లో గడపాల్సివచ్చింది. సాధారణంగా రాజకీయ నాయకులు జైళ్లకు వెళ్లినా.. వెంటనే బెయిల్ పై బయటకు వస్తుంటారు. ఎందుకంటే.. వాటిలో చాలా వరకూ వైట్ కాలర్ నేరాలుగానే ఉంటాయి. కానీ అఖిల ప్రియ మాత్రం రిమాండ్‌ల ఉండక తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: