ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..
తిరుపతి సీటుకోసం ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీ కూడా వెళ్లొచ్చారు. కేంద్ర పెద్దల్ని కలసినా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అభ్యర్థిపై ఆయన కొన్నాళ్లుగా మౌనం వహించారు. ఉమ్మడి కార్యాచరణ అంటున్నారే కానీ ఎక్కడా క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలు కలసి పనిచేసింది కూడా లేదు. ఇంతవరకు ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించలేదు. ఓ వైపు తన పంథాలో తాను పవన్ కల్యాణ్ రైతు యాత్రలు చేసుకుపోయాడు. బీజేపీ కూడా సొంతంగానే ముందుకు వెళ్తున్నది. ఎప్పుడో ఓసారి మాత్రమే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి.
మరోవైపు చాలామంది జనసేన కార్యకర్తలకు బీజేపీతో పొత్తు ఇష్టమే లేదు. సోషల్‌మీడియాలో, జనసేన గ్రూపుల్లో పెట్టే కామెంట్లు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. గతంలో పవన్‌కల్యాణ్ సీపీఐ, బీఎస్పీ, లాంటి విప్లవ భావాలున్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత వాటిని విడిచిపెట్టి, మతతత్వ పార్టీ అని ముద్ర ఉన్న బీజేపీ వెంట నడవటం పలు విమర్శలకు కారణం అయింది. ఇక తిరుపతి విషయానికొస్తే.. గతంలో తిరుపతిలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తమ పార్టీ అభ్యర్థే తిరుపతిలో పోటీచేస్తారని స్పష్టం చేశారు. జనసేన కూడా తమకే మద్దతు ఇస్తుందని చెప్పారు. వీర్రాజు ప్రకటనతో జన సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు త్యాగం చేశామని, ఇప్పుడు కూడా త్యాగం అంటే కష్టమేనంటున్నాయి.
గతంలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రజారాజ్యం తరపున చిరంజీవి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని జనసైనికుల వాదన. ఈ నేపథ్యంలో పోటీకి తమకే అవకాశం ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. ఈ నెల 21న తిరుపతి పర్యటనలో పవన్ ఇదే విషయంపై కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు.