జల్లికట్టుపై కీలక నిర్ణయం..!

NAGARJUNA NAKKA
జల్లి కట్టుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరిలో జరిగే  క్రీడకు షరతులతో పర్మిషన్‌ ఇచ్చింది. అయితే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అనుమతులు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.

తమిళనాట జరిగే జల్లికట్టుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఏటా జనవరిలో సంక్రాంతి  తర్వాత తమిళనాడులో పలుచోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. తమిళ తంబీలు దీనిని కేవలం ఓ క్రీడగానే కాకుండా సంప్రదాయ వేడుకగా భావిస్తుంటారు. 2017లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించినప్పుడు తమిళనాడు అంతటా భారీ ఉద్యమం జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులు జల్లికట్టు కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చింది. ఒక ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకువచ్చి సుప్రీం తీర్పును నిలుపుదల చేశారు. అదే ఏడాది యధావిధిగా జల్లికట్టు జరిగింది.
 
ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వల్ల జల్లికట్టుకు అనుమతిపై తమిళనాడు సర్కారు కొద్దిరోజులుగా ఊగిసలాడింది. . అయితే అనూహ్యంగా పళనిస్వామి సర్కారు అనుమతి ఇచ్చింది. కొన్ని షరతులతో ఈ క్రీడను జరుపుకోవచ్చని ప్రకటించింది. పోటీలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 150కి మించరాదని చెప్పింది.  బరిలో దిగే ముందు ఆటగాళ్లు కరోనా టెస్టులు చేయించుకుని రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. ఇటు ప్రేక్షకుల సంఖ్య కూడా 50 శాతం మాత్రమే ఉండాలని తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.  జల్లికట్టు కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తమిళనాట ఆనందం వ్యక్తం అవుతోంది. క్రీడకు కేంద్రంగా భావించే మధురై సమీపంలోని అలంగనల్లూరు ఇతర గ్రామాల్లో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

మరోవైపు జల్లికట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అనుమతులు ఇవ్వకపోతే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. మొత్తానికి జల్లికట్టుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: