మళ్లీ లాక్‌డౌన్‌లు.. విమానాలపైనా ఆంక్షలు..!

NAGARJUNA NAKKA
వ్యాక్సీన్‌ వచ్చేసింది.. కరోనా పీడ విరగడైపోయిందని అనుకున్నారంతా! ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌ రూపాంతం చెందింది.. మళ్లీ కోరలు చాస్తోంది. మరింత వేగంగా వ్యాపిస్తూ జనం ప్రాణాలు తీస్తోంది. దీంతో పలు మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. విమానాలపైనా ఆంక్షలు పెడుతున్నాయి.

సరిగ్గా ఏడాది క్రితం చైనాలో కరోనా కలకలం మొదలైంది. రోజుల వ్యవధిలోనే అది ప్రపంచమంతా పాకింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కరోనాను మహమ్మారిగా గుర్తించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  

కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్‌ ఒక్కటే మార్గమని భావించిన తరుణంలో.. టీకా అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం వల్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియను నెలలకు కుదించి.. క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తి చేశారు పరిశోధకులు. వ్యాక్సీన్‌ వచ్చేసింది.. ఇక కరోనా పీడ విరగడైందని భావిస్తున్న తరుణంలో కొత్త స్ట్రైన్‌ వెలుగు చూడడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.  

జంతువుల నుంచి మనుషులకు సోకే క్రమంలో వైరస్‌లు రూపాంతరం చెందుతాయి. దీనినే మ్యూటేషన్‌ అంటారు. ఇలా తయారైన వైరస్‌నే కొత్త స్ట్రైన్‌ అంటారు. కరోనా వైరస్‌ ఇప్పటి వరకూ చాలా సార్లు మార్పు చెందింది. గతంలో D614G  రకం శాస్త్రవేత్తలను భయపెట్టింది. తాజాగా గుర్తించిన కరోనావైరస్‌ను  VUI-202012 బై 01 రకంగా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. VUI అంటే - వైరస్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ అని అర్థం.

బ్రిటన్‌కు చెందిన న్యూ అండ్‌ ఎమర్జింగ్‌ రెస్పరేటరీ వైరస్‌ థ్రెట్స్‌ అడ్వెర్సరీ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం వేగంగా వ్యాప్తి చెందడానికి అవసరమైన అన్ని లక్షణాలు కొత్త వైరస్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ మార్పులు వైరస్‌ జన్యుక్రమంలో ఒక శాతంలో పదోవంతు కంటే తక్కువగా ఉన్నాయి. అంటే హెచ్ ఐవీ లాంటి వైరస్‌లతో పోల్చితే దీనిలో జరుగుతున్న మార్పులు చాలా తక్కువే అంటున్నారు నిపుణులు. కానీ.. పాత రకం వైరస్‌ కంటే ఇది 70 శాతం అధికంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.  ఇలాంటి వైరస్‌లు సూపర్‌ స్ప్రెడ్‌ ఈవెంట్లను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్‌ సమయంలో షాపింగ్‌లకు జనాలు గుమిగూడతారు. అప్పుడు వ్యాప్తి సాధారణంగా కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే బ్రిటన్‌ సహా అనేక దేశాల్లో ఆంక్షలను కఠిన తరం చేశారు. భారత్‌ సహా అనేక దేశాలు బ్రిటన్‌కు విమాన సర్వీసులు రద్దు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: