అంత అహంకారం పనికి రాదు..!

NAGARJUNA NAKKA
ఇప్పుడే ఏమంత తొందర... బ్రిటీషర్ల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రంపై మండి పడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను అసెంబ్లీలో చించేశారు. రైతులు ఆందోళన చేయడంతో బ్రిటీషర్లు కూడా చట్టాలను వెనక్కి తీసుకున్నారని.. కేంద్ర ప్రభుత్వానికి అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు కేజ్రీవాల్.

దేశానికి అన్నం పెట్టే రైతులు ఎముకలు కొరికే చలిలో నడి రోడ్డు పై నిద్రపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. మన రైతులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ  తీవ్రస్థాయిలో ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర వ్యవసాయ బిల్లులపై చర్చించేందుకు ఆప్ సర్కారు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో ప్రసంగించిన కేజ్రీవాల్ కేంద్రం తీసుకొచ్చిన చట్టాల ప్రతులను చించేశారు.

నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సమయంలో ఇలాంటి చట్టాలను తీసుకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గతంలో బ్రిటీష్ ప్రభుత్వం పంజాబ్ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిందని.. రైతులు ఉద్యమించగానే  తొమ్మిది నెలల్లో చట్టాల్ని వెనక్కి తీసుకుందని కేజ్రీవాల్ గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం  తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలకు ఆమ్‌ఆద్మీ పార్టీ మొదటి నుంచి మద్దతిస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులు, ఆప్ నేతలు అన్నదాతలకు మద్దతుగా ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ సర్కారు ఆందోళన చేస్తున్న రైతులకు నీరు, వైద్య సాయం అందిస్తోంది. రైతుల డిమాండ్లు నెరవేరే వరకూ తాము వారితోనే ఉంటామంటున్నారు ఆప్ నేతలు.

మొత్తానికి రైతులు మాత్రం తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు వెనక్కితగ్గేదేలేదంటున్నారు. సవరణలకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: