ప్రాజెక్ట్ విషయంలో ఓ పనైపోయింది..!

NAGARJUNA NAKKA
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సమర్పించింది. కృష్ణా జలాల వాడకం కోసం చేపట్టే కొత్త ప్రాజెక్టుల వివరాలను బోర్డుకు సమర్పించాలని గతంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకే డీపీఆర్‌ను సమర్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది.  
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు సమర్పించింది ఏపీ సర్కారు. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదనే వాదనతో కేంద్రం, కృష్ణా రివర్ బోర్డు అంగీకరించినా..  తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని.. రెండు రాష్ట్రాలు కృష్ణా నదిపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్‌ తీర్మానం మేరకు డీపీఆర్‌ను సమర్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ల ప్రక్రియ పూర్తైంది. రివర్స్ ఆక్షన్ అనంతరం 3307.07 కోట్ల రూపాయలకు బిడ్లను ఖరారు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్ పిఎమ్ ఎల్  ఇన్ ఫ్రా లిమిటెడ్‌తో కలిసి సుభాష్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్  బిడ్‌ దక్కించుకుంది. ప్రభుత్వం పిలిచిన ధర కంటే 0.88 శాతం అధికంగా బిడ్ ఖరారైంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం 3278.18 కోట్ల రూపాయలు. ఎన్‌సీసీతో పాటు నవయుగ కనస్ట్రక్షన్స్ ఈ బిడ్‌ కోసం పోటీ పడ్డాయి. తొలుత 3340 కోట్ల రూపాయలతో బిడ్ దాఖలైంది. రివర్స్ ఆక్షన్ తర్వాత 3307 కోట్ల రూపాయలకు బిడ్ ఖరారు చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల వరద నీటిని ఎత్తిపోయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: