ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

జనసేన విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి జన సైనికులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. తమతో పొత్తు పెట్టుకున్నా పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడం , కనీసం మిత్రపక్షంగా తమకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం వంటి వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా బహిరంగ విమర్శలకు జనసైనికులు దిగుతున్నారు. అసలు బిజెపి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయాన్ని జనసేన పార్టీ సైతం తేల్చుకోలేకపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం గా జనసేన కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే బిజెపి సహకారం బాగా అవసరం. బిజెపి ఆర్థిక, రాజకీయ సహకారంతోనే 2024 ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేసి గెలుపొందాలి అనే ఆలోచన లో జనసేన ఉండగా, బిజెపి మాత్రం ఒంటరిగానే బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుండటం గందరగోళం కలిగిస్తోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ జనసేన పోటీ చేసేందుకు మొదటి నుంచి ఆసక్తిగానే ఉంది. కానీ ఇదే స్థానం నుంచి బిజెపి సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో మిత్ర ధర్మం పాటించేందుకు పవన్ ప్రయత్నించారు.





 ఈ మేరకు బిజెపి ,జనసేన కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, ఇక్కడ ఎవరు పోటీ చేస్తే ఫలితం ఉంటుందనే విషయాన్ని తేల్చుకోవాలి అనుకున్నారు. కానీ ఆ కమిటీ ఇంకా పని మొదలు పెట్టక ముందే ఆకస్మాత్తుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికలలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారు అంటూ ప్రకటించిన తీరు జనసేనకు ఆగ్రహం కలిగించింది.  ఒక్క మాట చెప్పకుండా ఈ విధంగా బిజెపి వ్యవహరించడంపై వారు బిజెపి తీరుపై విమర్శలు చేస్తున్నారు.ఇదే కాదు బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి చూసుకుంటే, ప్రతి విషయంలోనూ జనసేన దూరంగా పెడుతూ బిజెపి వ్యవహరిస్తున్న తీరు ఒకపక్క ఆందోళన కలిగిస్తున్నా, ఆ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా మౌనంగానే వాటిని భరిస్తూనే వస్తున్నారు. 





కొద్దిరోజులుగా చూసుకుంటే జనసేన బిజెపి విడివిడిగానే తమ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికి వారే విడివిడిగా యాత్రలు చేస్తూ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అసలు బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనే అనుమానాలు ఈ రెండు పార్టీల కార్యకర్తలను పెరిగిపోతున్నాయి. జనాల్లోనూ ఈ పొత్తుపై సెటైర్లు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: