రిజిస్ట్రేషన్లకు లైన్‌ క్లియర్ !

NAGARJUNA NAKKA
తెలంగాణవ్యాప్తంగా వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆదేశాలతో నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. ముందుగా నేటి నుంచి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌ చేసుకునే అవకాశం వచ్చేసింది. ఈ నెల 14నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

వందరోజులుగా రియల్ వ్యాపారులు, ప్రజలు పడుతున్న కష్టాలకు తెరపడింది. హైకోర్టు సూచనలతో నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. అయితే రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 14నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోనే ఈ రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. స్టాట్‌ బుక్ చేసుకున్నవారిని మాత్రమే ఆఫీసుల్లోకి అనుమతిస్తారు. ఆస్తిపన్ను, గుర్తింపు సంఖ్య ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది.

ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు‌పై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. వ్యవసాయేతర ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ధరణి వివరాలు మాత్రమే ఆపాలని సూచించామని తెలిపింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఎటువంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యపై స్పందించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని హైకోర్టుకు తెలిపారు.

గతంలో రిజిస్ట్రేషన్ CARD పద్ధతిలో జరిగాయని పిటిషన్ తరపు లాయర్ తెలిపారు. అదే పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగించాలని కోరారు.  రిజిస్ట్రేషన్‌కు ప్రాపర్టీ ట్యాక్స్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు ఏజీ. ఆధార్ కార్డు, ధరణిలో ఎంట్రీ వివరాలు అడగొద్దని కోరారు పిటిషనర్ తరపు లాయర్. వ్యవసాయేతర ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ధరణిపై మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ధరణిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌  హైకోర్టును గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను పాతపద్దతిలో చేయాలని హైకోర్టు తెలపడంతో ప్రభుత్వం కూడా అందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజిస్ట్రేషన్లకు ఇన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు తొలిగిపోయినట్లయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: