మేయర్ కుర్చీ: గెలిచిన కార్పొరేటర్ల పై ఆఫర్ల వల...!
గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ 56 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ ఎంతో కష్టపడి గతం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా 48 సీట్లను సంపాదించుకుంది. ఇకపోతే ఎంఐఎం 44 డివిజన్లను దక్కించుకుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం రెండు చోట్ల గెలిచింది. ఒకవేళ ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్నా మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోలేని పరిస్థితి. మరి ఇక మిగిలినది ఏవైనా రెండు పార్టీలు కలిసి సంయుక్తంగా మేయర్ పీఠాన్ని అధిరోహించడమే. కానీ టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీ లు కలిసే అవకాశం లేదు... బిజెపికి ఎంఐఎం కి అసలు పొత్తు కుదరదు.... ఇక మిగిలిన దారి గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ వైపు తిప్పుకోవడమే మిగిలింది అంటున్నారు రాజకీయ వర్గాలు.
అయితే కొంత సమాచారం ప్రకారం ఈ సారికి స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీలు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేకపోయిన ఒకరిద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారిని బీజేపీ నుంచి బరిలో దించారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. గెలిచిన తర్వాత తిరిగి సొంత గూటికి తీసుకు రావొచ్చనే ప్లాన్‌తో పంపారట. ఇప్పుడు అలా గెలిచినా అభ్యర్థులు బీజేపీ నుండి తెరాస లోకి వచ్చే అవకాశముందని మరికొందరి అభిప్రాయం. ఇలా ఎన్నో ఆలోచనల మధ్య ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే....