పార్లమెంట్ కొత్త భవనానికి శంకుస్థాపన !
నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. శృంగేరీ శారదా పీఠం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. తర్వాత సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. రాజ్యాంగం రూపంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించిందని, అలాగే నూతన పార్లమెంట్ భవనం ఆత్మనిర్భర్ భారత్ కు దిశానిర్దేశం చేయనుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల పూర్తైన సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుందని చెప్పారు. దేశ ప్రజలందరూ గర్వించాల్సిన క్షణమని అన్నారు.
చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నూతన భవనానికి శంకుస్థాపన చేశామన్నారు ప్రధాని మోదీ. కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్ సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలువనుంది. శకుస్థాపన కార్యక్రమంలో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పారిశ్రామికవేత్త రతన్ టాటా పాల్గొన్నారు.
నాలుగంతస్తుల ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్నారు. 64,500 చదరపు మీటర్ల ప్రాంతంలో .. 971 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ భవన నిర్మాణం జరుగుతోంది. ఇందులో నిర్మిస్తున్న లోక్‌సభలో ఒకేసారి 888మంది సభ్యులు కూర్చునే విధంగా రూపకల్పన చేశారు. ఉభయసభల సమావేశం జరిగినప్పుడు ఏకంగా 12వందల 24 మంది కూర్చోవచ్చు. అలాగే రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చోడానికి అవకాశముంటుంది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను 20వేలకోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రపతి భవన్ నుంచి మొదలుకొని.. ఇండియా గేట్ వరకు అధునాతన హంగులతో నిర్మాణాలను చేపట్టనున్నారు. అందులో ముందుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు.