మళ్లీ త్రిపుల్ తలాక్ కేసు..!
హైదరాబాద్ నగరంలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో ఉండే సభా ఫాతిమాకి అమెరికాలో ఉన్న తన భర్త నుంచి ఫోన్ వచ్చింది. తమ కుటుంబ విషయాలు, మంచీ చెడూ మాట్లాతాడని ఆశించి.. సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసిన బార్య ఫాతిమాకు అటునుంచి వచ్చిన మాటలు విని షాక్ అయింది. భర్త నోటి నుంచి మూడు సార్లు వచ్చిన తలాక్ మాటలు విని తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఖండాంతరాల దూరం నుంచి ఫోన్ చేసి..వైవాహిక బంధానికి శాశ్వత దూరం చేయడాన్ని ఫాతిమా జీర్ణించుకోలేకపోయింది.
భారత ప్రభుత్వం .. ట్రిపుల్ తలాక్ కు గతంలోనే చెక్ పెట్టింది. ఈ మేరకు చట్టం చేసి అమలు చేస్తోంది. అయినప్పటికీ కొందరు దుర్మార్గులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. పాతబస్తీలో ఫాతిమాకు ట్రిపుల్ తలాక్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాకు అమెరికాలో ఉన్న అభీద్ అలీ అహ్మద్ తో వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు ఇద్దరు కలిసి అమెరికాలోనే ఉన్నారు. అక్కడినుంచి కొద్దినేలల క్రితం సభా ఫాతిమా హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. అయితే అభీద్ అలీకి ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా నిన్న రాత్రి ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అంతేకాకుండా వాట్స్అప్ ద్వారా కూడా ట్రిపుల్ తలాక్ ను పంపించాడు.
దీంతో షాక్ కు గురైన సభా ఫాతిమా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా సభా ఫాతిమా సంప్రదించారు. తనకు అభిద్ అలీ ట్రిపుల్ తలాక్ చెప్పారని చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫాతిమా డిమాండ్ చేస్తున్నారు.