కాంకషన్ సబ్ స్టిట్యూట్ పై రచ్చరచ్చ !

NAGARJUNA NAKKA
కాంకషన్ సబ్ స్టిట్యూట్ పై రచ్చరచ్చ అవుతోంది. తొలి టీ20లో రవీంద్ర జడేజా బదులు చాహల్ ను ఆడించడంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. రెఫరీ చాహల్ ను ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా మాజీలు మాత్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా రవీంద్ర జడేజాకు బదులు స్పిన్నర్ యజ్వేంద్ర చాహెల్ ను కంకషన్ సబ్ స్టిట్యూట్ గా తీసుకోవడంపై క్రికెట్ వర్గాల్లో వివాదం నెలకొంది. కంకషన్ నిబంధనలకు కట్టుబడే భారత్ వ్యవహరించిందని మాజీలు సమర్థిస్తుండగా పలువురు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన జడేజా.. టీమిండియా 160ప్లస్ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలోనే అతని హెల్మెట్ కు బంతి తగిలి గాయానికి గురయ్యాడు. ఆ పై రెండో ఇన్నింగ్స్ లో ఆడలేదు. తొలి ఇన్నింగ్స్ తర్వాత బీసీసీఐ వైద్య బృందం జడేజాను పరిశీలించి మిగిలిన ఆటలో పాల్గొనలేడని స్పష్టం చేయడంతో టీమిండియా మ్యాచ్ రిఫరీకి విషయం తెలియజేసింది. వెంటనే చాహల్ ను కంకషన్ సబ్ స్టిట్యూట్ గా తీసుకుంది. చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను ఇండియా వైపు టర్న్ చేశాడు. మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు.

మ్యాచ్ జరుగుతుండగానే చాహల్ ను కంకషన్ సబ్ స్టిట్యూట్ గా తీసుకోవడం పై ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ తో వాగ్విదానికి దిగాడు. కంకషన్ నిబంధనల ప్రకారం ఎవరైనా ఆటగాడికి ఆట మధ్యతో తలకు గాయమైతే అతడికి బదులు మరో ఆటగాడిని తీసుకునే వీలుంది. అయితే అలా కంకషన్ గా వచ్చే ఆటగాడు గాయపడిన ఆటగాడి కోవకే చెందాల్సి ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే రవీంద్ర జడేజా ఆల్ రౌండర్. చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్. దీంతో ఇద్దరి మధ్యా వ్యత్యాసం ఉందనేది ఆస్ట్రేలియా అభ్యంతరం. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జడేజా బదులు, చాహల్ ను ఆడించడాన్ని సునీల్ గవాస్కర్ సహా.. మాజీ క్రికెటర్లు సమర్థించగా ఆస్ట్రేలియా మాజీలు పెదవి విరుస్తున్నారు. అయితే కాంకషన్  సబ్ స్టిట్యూట్ పై ఐసీసీ ఇంకా పూర్తి క్లారిటీతో వ్యవరించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: