హైదరాబాద్: రాష్ర్టంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా రాష్ర్టంలోని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు కొత్త కోణానికి తెరలేపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలకు పోటీగా ఆందోళనలు చేస్తున్నారు. పోటీ ధర్నాలకు దిగుతున్నారు.
పోటీ ధర్నాలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజా సమస్యలను గాలికి వదిలాయి. రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. తాగు, సాగునీటి కష్టాలుండనేనున్నాయి. కరంటు గురించి వేరే చెప్పనక్కర్లేదు. కరువు కరాళ న్రుత్యం చేస్తోంది. ఇలా అనేక సమస్యలుండగా వీటి జోలికి వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలు మద్యం ధరలనీ, రోడ్డు పనులనీ ఆందోళనకు దిగుతున్నాయి.
ఇక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు పోటీగా ధర్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీవాళ్లకు నిజంగా ప్రజలపై ప్రేమ వుంటే మిగతా సమస్యల పరిష్కారానికి ఆందోళన చేసివుంటే ప్రజలు హార్షించేవారు. కానీ, అలా చేయడం లేదు. అటు అధికారం, ఇటు ప్రతిపక్షం బాధ్యతలను మరిచిపోయారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే డ్రామాలాడుతున్నట్లు తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఆయా పార్టీల నేతల తీరు వల్ల కార్యకర్తలు రెచ్చిపోయి, ప్రజల్లో ప్రశాంతత చెడిపోయే విధంగా తయారైంది.
మొన్న విజయనగరం...నిన్న విజయవాడ. మద్యం మాఫియాను వ్యతిరేకిస్తూ విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధర్నాకు దిగితే...ఆయనకు పోటీగా విజయనగరంలో మంత్రి బొత్స వర్గానికి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మందిమార్భలంలో పోటీ ధర్నాకు దిగారు. దీనితో టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య కొట్లాటకు దారితీశాయి. తాజాగా విజయవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను తీసుకుంటే...చంద్రబాబు మహాధర్నాకు పోటీగా ఎంపీ లగడపాటి రాజగోపాల్ అవగాహన సదస్సు పేరిట సోమవారం నాడు చేసిన హల్ చల్ విజయవాడ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసింది. రోజంతా విజయవాడ గజగజ వణికిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోటీ ధర్నాల వల్ల ఉద్రిక్తత వాతావరణం నెలకుంటుందే తప్ప మరొకటి కాదు. రాష్ర్టంలో ఇలాంటి పోటీ ఆందోళనలు, ధర్నాలు ఎప్పుడూ జరగలేదు.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ధర్నాలకు నిషేధిత ప్రాంతమైన బషీర్ బాగ్ లో సోనియాగాంధీకి మద్దతుగా ధర్నా చేశాడు. ఇక అప్పటి నుంచి అధికారంలో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవడమే కాకుండా, పోటీ ధర్నాలు చేస్తుండటం చూసేవాళ్లకు విస్మయం కలిగిస్తోంది.వాస్తవ పరిస్థితులను వివరించే ధోరణి పేరిట అధికార కాంగ్రెస్ నేతలు పంతాలకు, పట్టుదలలకు పోతున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ప్రతిపక్షాలు చేసే పనిని అధికార నేతలు భుజాన వేసుకోవడం చూస్తుంటే వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే ఇలా చేస్తుందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార నేతలు చేస్తున్న పోటీ ధర్నాలతో రాష్ర్టంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలు ఇలా వ్యవహారిస్తున్నారా? లేక నిజంగానే ప్రతిపక్షం నేతలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టడానికి చేస్తున్నారా? అనే దానిపై చర్చ సాగుతోంది. విజయవాడ సంఘటనను తీసుకుంటే...రాజగోపాల్ కేవలం పబ్లిసిటి గురించి బాబు మహాధర్నాకు పోటీగా అదేరోజున అవగాహన సదస్సు పేరిట ఆందోళనకు దిగారనీ అందరూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ర్ట చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రతిపక్షాల హక్కులను కాలరాసే విధంగా అధికార కాంగ్రెస్ నేతలు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈపోటీ ధర్నాలు రాష్ర్టంలో ఎటువైపు దారితీస్తాయో తెలియడం లేదు.
మొత్తానికి టీడీపీ-కాంగ్రెస్ పార్టీల ప్రజలు మాత్రం నలిగిపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిస్థితుల నుంచి రాష్ర్ట ప్రజలు ఎప్పుడు బయటపడతారో కాలమే నిర్ణయించాలి మరి. ఇప్పటికైనా పాలక, ప్రతిపక్షం కాస్తంత ప్రజా సమస్యలపై ద్రుష్టిని మళ్లిస్తే బాగుంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: