ఆ రెండు కారణాల వల్లే.. లేకపోతే..!

NAGARJUNA NAKKA
కరోనాకు తోడు పెరిగిన వాయుకాలుష్యం కూడా దీపావళి పండుగ కళ తప్పడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన స్పృహ కూడా.. విక్రయాలు తగ్గడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. పిల్లలు మిస్సవుతారన్న ఒకే ఒక్క కారణంతో కొనుగోలు చేస్తున్నామని, లేకుంటే మొత్తంగా ఈ ఏడాది బాణసంచాపై బ్యాన్ విధిస్తే బాగుండేదని కొందరు చెబుతున్నారు.

వాయు కాలుష్యం భయపెడుతోంది. ఢిల్లీలాంటి మహానగరాల్లో అయితే ఎప్పుడో వాయుకాలుష్యం.. తీవ్రదశకు చేరింది. మిగిలిన నగరాల్లోనూ ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండడంతో.. పండుగ సంబరాల్లో జాగ్రత్తలు వహించాలని కేంద్రం హెచ్చరికలు చేస్తోంది. దీంతో జనం కూడా ఈ ఏడాది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. వేలకు వేల రూపాయలు పెట్టి బాణసంచా కొనుగోలు చేసి అట్టహాసంగా పండుగ జరుపుకునే వాళ్లు కూడా.. సాదాసీదాగా పండుగ జరుపుకుంటున్నారు.

ఒక్క ఏడాది పండుగను మిస్సైన పర్వాలేదు కానీ.. కరోనా వస్తే అంతే సంగతులంటున్నారు కొందరు. అందుకే ముఖ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటున్నామంటున్నారు. దివ్వెల పండుగ దీపావళిని.. భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని చెబుతున్నారు. అంతా బాగుంటే వచ్చే ఏడాది పండుగను వైభవంగా జరుపుకోవచ్చంటున్నారు.

బాణసంచా కొనుగోళ్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. బాంబులు, ఇతర భారీగా శబ్దాలు వచ్చే సరుకు కాకుండా.. చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు,చక్రాలు, తాళ్లు లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కొనుగోలు చేస్తున్నారు. అవీ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నవే కొంటున్నారు. దీంతో లక్ష్మీబాంబ్‌లు, ఆటంబాంబ్‌లు లాంటివి అమ్ముడు కావడం లేదు.

వీటితో పాటు పెరిగిన రేట్లు కూడా టపాసుల అమ్మకాలు తగ్గడంపై ప్రభావం చూపాయి. గతేడాదితో పోలిస్తే, ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనుగోలు దారులు చెబుతున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు  పడుతున్నామని, ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో అంతంత ధరలు పెట్టి, కొనుగోలు చేయాల్సి రావడం కూడా .. కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. ఇది కూడా షాపులు వెలవెలబోవడానికి , బిజినెస్ కాకపోవడానికి కారణమని ప్రజలు, వ్యాపారులు చెబుతున్నారు. రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి, షాపులు వేశామని.. ఇప్పుడు కనీసం పదోవంతు బిజినెస్ కూడా కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: