నోట్ల రద్దుతో ఒరిగిందేంటంటే..!

NAGARJUNA NAKKA
నోట్ల రద్దుతో .. దేశానికి కొన్ని ప్రయోజనాలు సైతం సమకూర్చిందని చెప్పక తప్పదు. కొంతవరకూ అవినీతికి చెక్ చెప్పిందని నిపుణులు చెబుతున్నారు. డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రధానంగా పన్ను చెల్లింపు దారుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది.

నోట్ల రద్దు భావి భారతానికి కొంత ప్రయోజనకరంగా ఉండటంతో పాటు డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహమందించిందని మరికొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ భారీగానే పెరిగాయి. ప్రత్యేకించి, పన్ను చెల్లింపులను ఎగ్గొట్టి తిరిగే వ్యాపారుల చీకటి యత్నాలకు.. అడ్డుకట్ట వేసిందని చెప్పొచ్చు. ప్రతీ లావాదేవీ నమోదు చేయాల్సి రావడంతో.. వారి పన్ను చెల్లింపులు పెరిగాయి. దీనికి తోడు పౌరులు, ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాల ఆస్తులను తప్పనిసరిగా బహిర్గతం చేయడం, ఆస్తులతో ఆధార్ లింకింగ్ వంటి అంశాలు నల్లధనాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి.

నోట్ల రద్దు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోంది. నోట్ల రద్దు ప్రకటన నాటికి దేశంలో పదిహేడున్నర లక్షల కోట్లు చలామణిలో ఉంది. అందులో 500, 1000 నోట్లు 15.44 లక్షల కోట్లు. అంటే అప్పటికి చలామణిలో ఉన్న నగదులో 86 శాతం ఈ పెద్దనోట్లదే. ఇందులో 2017 జూన్ 30 నాటికి బ్యాంకుల్లో 15.28 లక్షల కోట్లు డిపాజిట్ అయింది. బ్యాంకులకు చేరని డబ్బు 16,000 కోట్లు మాత్రమే. నోట్ల ముద్రణకు 2014-15లో 3 వేల 762 కోట్లు, 2015-16లో 3 వేల 421 కోట్లు, 2016-17లో 7 వేల 965 కోట్లు ఖర్చయ్యాయి. పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా పన్ను పరిధిలోకి 56 లక్షల మంది వచ్చి చేరారు. ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు 24.7 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే వ్యక్తిగత ఆదాయపన్నులో ముందస్తు వసూళ్లలో 41 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.

ఉగ్రవాదులు, తీవ్రవాదులకు నగదు లభ్యత తగ్గింది. వారి దగ్గరనున్న నోట్లను మార్చుకునే దారి లేకపోవడంతో.. నిధుల సమస్యతో విలవిలలాడాయి. ప్రధానంగా జమ్మూకశ్మీర్‌లో .. ఉగ్రదాడులు, రాళ్ల దాడులుతగ్గాయి. నక్సలైట్ల పైనా నోట్ల రద్దు ప్రభావం పడింది. హవాలా లావాదేవీలు సగానికి తగ్గాయి. పాకిస్తాన్‌లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: