ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఆ సేవలు..!
దేశంలో యూజర్లకు వాట్సప్ పే అందుబాటులోకి వచ్చింది. వాట్సప్ పే ద్వారా యూపీఐ సేవలకు అనుమతి ఇచ్చింది ఎన్ పీసీఐ. దేశంలోని 160 బ్యాంకుల్లో ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు యూపీఐ చెల్లింపులను వాట్సప్ పే ద్వారా చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంకు వాట్సాప్ పే పోటీ ఇవ్వనుంది.
తొలి దశలో 20 మిలియన్ల వాట్సాప్ యూజర్లకు వాట్సప్ పే సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత దశలవారీగా యూజర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం యూపీఐ చెల్లింపుల్లో వాట్సాప్ వాటా 30 శాతానికి మించకూడదని ఎన్‌పీసీఐ ఆంక్షలు విధించింది. భారత్‌లో వాట్సాప్‌కు 400 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
వాట్సాప్ పే చేయాలనుకునే వారు మొదట వాట్సాప్ అప్ డేట్ వెర్షన్ కలిగి ఉండాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ను వాట్సాప్‌తో లింక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్‌లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఆ నెంబర్‌తోనే వాట్సాప్ ఉండాలి. వాట్సాప్ పే కోసం పేటీఎం తరహాలో కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరమేమి లేదు.
మరోవైపు స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది వాట్సప్. దీనిద్వారా ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన వీడియోలను, ఫొటోలను మరింత సులభంగా డిలీట్ చేయవచ్చు. వాట్సాప్ తీసుకొస్తున్న డిస్‌అపియరింగ్ మెసేజెస్ సదుపాయంతో.. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లను కూడా కనిపించకుండా చేయొచ్చు. ఈ ఫీచర్ ఆన్‌లో ఉన్న వాట్సాప్ నంబర్లకు వచ్చిన మెసేజ్‌లు 7 రోజుల తర్వాత కనిపించకుండా పోతాయ్. మొత్తానికి వాట్సాప్ కొత్త విధానాన్ని అందుబాటులోకి తేవడంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.