అమెరికా ఎన్నికల ఫలితాలపై ఓ అంచనా..?
జార్జియా, నెవడా ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ప్రసంగించే అవకాశం ఉందని బైడెన్ టీమ్ ప్రకటించడంతో.. సీక్రెట్ సర్వీస్ అదనపు ఏజెంట్లను నియమించింది. కౌంటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత వెనుకబడటంటో ట్రంప్ వర్గంలో అసహనం పెరుగుతోంది. మిచిగన్, పెన్సిల్వేనియా, జార్జియాల్లో కౌంటింగ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే ట్రంప్ వర్గం చట్టపరమైన చర్యలను మొదలుపెట్టింది. పోస్టల్ బ్యాలెట్లు మోసపూరితంగా ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే అందుకు తగ్గ ఆధారాలను మాత్రం బయట పెట్టలేదు.
కౌంటింగ్ జరుగుతున్న చోట్ల పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నా.. కొన్ని నగరాల్లో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి.ప్రతి బ్యాలెట్‌నూ లెక్కించే వరకూ ఎన్నికలు పూర్తి కావు.. మనం గెలుపుదారిలో ఉన్నాం అని బైడెన్ డెలావేర్‌లో తన మద్దతుదారులతో అన్నారు.
పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో నిరసనలు జరుగుతున్నాయి. పెన్సిల్వేనియాతోపాటు విస్కాన్సిన్, మిషిగన్, జార్జియాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రతి ఓటునూ లెక్కపెట్టాలని నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రదర్శనలు చేపడుతున్నవారిలో చాలా మంది తాము జో బైడెన్ మద్దతు దారులమని చెబుతున్నారు.
స్టాప్ ది కౌంట్ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్ సెటైర్ వేశారు. 'చిల్ డొనాల్డ్, చిల్' అంటూ గ్రెటా చేసిన ప్రకటన ఇపుడు వైరల్ అవుతోంది. చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ గ్రెటా సోషల్ మీడియాలో ప్రకటించారు.