కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి తన మాటలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా, వదిలిపెట్టకుండా తన మాటలకు పదును పెడుతూ ఉంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లో కురిసిన వర్షాల కారణంగా నగరంలో వరదలు, భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకోవడం వంటి వ్యవహారాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా ఈ వ్యవహారాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నగరంలో సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం అంటూ టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ అది అంతా ఉత్తిదే అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఆక్రమణలను ప్రోత్సహించిందని, కెసిఆర్ అనుచరులు చెరువులను ఆక్రమించుకుని లేఅవుట్లు వేసుకుని అమ్ముకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అక్రమ వ్యవహారాల కారణంగా హైదరాబాదులో వరదలు సంభవించాయి అని, సుమారు 120 మంది వరదల్లో మరణించారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే నంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అసలు హైదరాబాదులో ఇంతటి విపత్తు సంభవించడానికి మంత్రి కేటీఆర్ అసమర్ధతే కారణం అంటూ రేవంత్ విమర్శించారు. ముంపు బాధితులకు సహాయం అందించే విషయంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, వరద సహాయ నిధులు 200 కోట్ల వరకు టిఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని, ప్రభుత్వం నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉండేది కాదని, రేవంత్ విమర్శించారు.
ఈ వ్యవహారంపై తక్షణమే విజిలెన్స్ ఏసీబీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు బంధువులు నగదు పంపిణీ చేశారని, గ్రేటర్ లో ఓట్లను కొనుగోలు చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ఉపయోగిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న తనకు వరద సహాయం పంపిణీ విషయమై ఎందుకు సమాచారం అందించలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కోర్టులో పిటిషన్ వేస్తానని రేవంత్ హెచ్చరించారు.