అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎప్పుడంటే..?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఐదుగురే ఓటు వేశారు. ఈ ఐదు ఓట్లు బైడెన్ ఖాతాలో పడ్డాయి. ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. డిక్స్‌విల్లీ గ్రామస్తులు ఏకపక్షంగా డెమోక్రటిక్ అభ్యర్థికి ఓటేశారు. అమెరికా- కెనడా సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో డిక్స్‌విల్లీ గ్రామం ఉంది. 1960 నుంచి సాంప్రదాయబద్దంగా ఈ గ్రామం నుంచే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలవుతోంది.
డిక్స్‌విల్లీకి సమీపంలోని మిల్స్‌ఫీల్డ్‌లో కూడా అర్థరాత్రే ఓటింగ్ జరిగింది. మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 బైడెన్‌కు అయిదు ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో డిక్స్‌విల్లీ గ్రామ ఓటర్లు హిల్లరీ క్లింటన్‌కు ఓటేశారు. కానీ ఆ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఈసారి కూడా ఈ గ్రామస్తులు బైడెన్‌కు ఓటు వేశారు. న్యూ హ్యాంప్‌షైర్‌లోని మున్సిపాల్టీల్లో వంద కన్నా తక్కువ నివాసితులు ఉన్న గ్రామాల్లో అర్థరాత్రే పోలింగ్ ప్రారంభం అయింది. రిజిస్టర్డ్ ఓట్లు పోలైన వెంటనే పోలింగ్ బూత్‌లను మూసివేశారు.
అమెరికాలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్లు అన్నీ ఉదయం 6 గంటలకు తెరుచుకున్నాయి. అమెరికాలో జరిగిన ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే పది కోట్ల ఓట్లు పోలయ్యాయి. అమెరికా కొత్త అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఐదు రాష్ట్రాలే కీలకం. అవి పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, జార్జియా, ఫ్లోరిడా. గత ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అంచనాలు తారుమారు కావడంతో హిల్లరీ క్లింటన్ ఓడిపోయారు, డెమోక్రాట్లకు కంచుకోటలుగా భావించే రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలలో గత ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ సారి ఇక్కడ ఎలా ఉంటుందనే ఉత్కంఠ పెరిగింది.
ఇప్పటికే 10 కోట్ల మంది అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. మరో 6 కోట్ల మంది ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అమెరికా ఎన్నికల చరిత్రలోనూ ఇదో రికార్డు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే ఆస్కారం ఉందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి భారతీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అధ్యక్ష ఎన్నికల పూర్తి ఫలితాలు రావాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ పోలింగ్ జరిగిన మరుసటి రోజే దాదాపు విజేత ఎవరో తేలుతుంది. అయితే ఈసారి పూర్తి ఫలితాలు రావడానికి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్, ముందస్తు బ్యాలెట్ల సంఖ్య కోట్లలో ఉండటంతో వాటిని లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.