ఉపఎన్నికలో అధికార పార్టీ హవా కొనసాగిస్తుందా..?
దుబ్బాకలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. వాటిలో ఐదు సిద్ధిపేట జిల్లా.. రెండు మెదక్ జిల్లా పరిధిలోకి వస్తాయి. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయిపోల్ ఉండగా.. మెదక్ జిల్లాలో నార్సింగ్, చేగుంట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో దుబ్బాక గ్రేడ్ 2 మున్సిపాలిటీ ఉంది. ఈ నియోజకవర్గం మొత్తంలో గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ. అత్యధికులకు వ్యవసాయమే జీవనాధారం. బీడీ, చేనేత కార్మికులు కూడా ఎక్కువే.
దుబ్బాకలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 315. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు అధికారులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా ఓటర్ల సంఖ్యను చూస్తే.. దుబ్బాక మండలంలో 55వేల 208 ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 27వేల 225, మహిళలు 27 వేల 983, ఈ మండలంలో 84 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
నవంబర్ 3న ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది. నవంబర్ 10 ఫలితం వెల్లడిస్తారు. కోవిడ్ కారణంగా పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్ లేకుండా ఓటు వేయడానికి ఎవరినీ అనుమతించరు. ఉప ఎన్నిక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగానే ఉన్నాయి. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి రిటర్నింగ్ అధికారిగా ఉండగా.. 600 మంది అధికారులు ఎన్నికల విధుల్లోఉన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎన్నికల కమిషన్ తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ఠాకూర్‌ను పంపించింది. గత ఎన్నికల్లో 86 శాతం పోలింగ్ నమోదైంది. దానిని ఇంకా పెంచాలని చూస్తున్నారు అధికారులు.