ఏపీలో ఆ ఎన్నికలు ఎప్పుడో తెలుసా..?
ఈ ఏడాది మార్చి 7న స్థానికసంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా.. అదే నెల 15వ తేదీన కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో 660 జెడ్పీటీసీలు.. 9984 ఎంపీటీసీలు.. 76 మున్సిపాల్టీలు.. 12 మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరపాలని భావించింది. వీటిని రెండు విడతల్లో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా తొలి దశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీ స్థానాలకు.. రెెండో దశలో 327 జెడ్పీటీసీలకు.. 4960 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రిపేర్ అయింది ఎస్ఈసీ. అలాగే తొమ్మిదో తేదీ నుంచి కార్పోరేషన్లు.. మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఓ పక్కన ఈ ప్రక్రియ జరుగుతుండగానే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల తొలి దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 2129 ఎంపీటీసీలు.. 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కూడా అయ్యాయి. ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ దగ్గర స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలో బుధవారం నాటి ఎస్ఈసీ సమావేశానికి అధికార వైసీపీ సహా పార్టీలన్నీ హాజరు కానున్నాయి. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పకున్నప్పటికీ.. వారు కూడా బుధవారం నాటి సమావేశంలో హాజరై.. ఎన్నికలను నిర్వహించాలనే దిశగానే తమ అభిప్రాయంగా చెప్పనున్నట్టు సమాచారం.కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని.. ప్రస్తుతం ఎన్నికలనేవి జరిపితే ఆ వ్యాప్తి మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతోంది. ఇక నవంబర్, డిశెంబర్ నెలల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉన్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమనేది ప్రభుత్వ వాదన.