బెంగళూరుపై వరుణుడు పగబట్టాడా..?

NAGARJUNA NAKKA
అదే వర్షం.. అదే బీభత్సం.. నగరం మాత్రమే మారింది. అవును.. దేశంలో వర్షం బీభత్సం కొనసాగుతోంది. ఎక్కడ కురిస్తే అక్కడ కుండపోతే. జనం ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోవాల్సిందే.  గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌ను వణికించిన వరుణ దేవుడు ఇప్పుడు మరో దక్షిణాది నగరం బెంగళూరుని వణికించాడు.
మొన్నటిదాకా హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాలు ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టించాయి‌. వర్షాల దెబ్బకి గార్డెన్ సిటీ అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో చెరువులా తయారయింది. నాన్‌స్టాప్ వర్షానికి సౌత్‌ బెంగళూరులోని చాలా ప్రాంతాలు వణికిపోయాయి‌. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కర్ణాటక రాజధాని అతలాకుతలం అయింది.
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటితో నిండాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైసూరు రోడ్డు, సిల్క్ బోర్డు జంక్షన్,  బసవనగుడి తదితర కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది.
ఇటు సౌత్ బెంగళూరులోనికోరమంగళ, బీటీఎం లేఅవుట్, జయనగర, బవసనగుడి, ఆర్ఆర్ నగర్, కెంగెరి, మల్లేశ్వరం ప్రాంతాల్లో ఇవాళ్టికి కూడా వరద నీరు తగ్గలేదు.నగర శివార్లలోని హోసకెరిహళ్లి ప్రాంతంలోని గురుదత్తా లేఔట్‌లో వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. స్థానికులు ఆ దృశ్యాన్ని తమ సెల్ ‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
నగర శివార్లలోని పలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. బెంగళూరు నగర పాలక సంస్థ సిబ్బంది, నగర పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మొత్తానికి బెంగళూరును వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపిలేని వర్షానికి నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. నగరావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారుల అవస్థలు అయితే ఇక అన్నీ ఇన్నీ కావు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: