అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా వైరస్ కీలకం..!

NAGARJUNA NAKKA

ప్రపంచ దృష్టినంతా తమవైపు తిప్పుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కరోనా వైరస్‌ కీలకాంశంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్‌ నిర్లక్ష్యంవల్లే దేశంలో కరోనా విజృంభించిదని డెమోక్రాట్లు విస్తృతప్రచారం చేస్తుంటే.. కరోనా కట్టడి తనవ ల్లే సాధ్యమంటున్నాడు ట్రంప్. ఇద్దరు అభ్యర్థుల మధ్య చాలా అంశాల్లో మాటల యుద్ధం జరుగుతున్నా.. అసలు అంశం మాత్రం మాత్రం కరోనానే.
మొదటి నుంచీ కరోనా వైరస్‌ను సింపుల్‌గానే తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు అదే వైరస్‌బారిన పడటం కలకలం రేపింది. ట్రంప్‌తో పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ సోకింది. మరికొందరు వైట్‌హౌజ్‌ సిబ్బందికి కూడా కరోనా సోకడం ఆందోళన రేకెత్తించింది. దీంతో అప్పట్లో తన మాట పెడచెవిన పెట్టడం వల్లే వైట్‌హౌజ్‌లో ఇలాంటి పరిస్థితులంటూ.. ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు అమెరికన్‌ ప్రఖ్యాత వైద్యుడు ఫౌచీ. అంతేకాదు ట్రంప్‌ కోవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించి.. వైట్‌హౌజ్‌కు రావడం కూడా వివాదానికి కారణమైంది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ట్రంప్ కరోనా సోకిన తర్వాత దీన్నే తమ  ఎన్నికల అంశంగా మార్చుకున్నాయి. ట్రంప్ నిర్లక్ష్యం వల్లే రెండు లక్షల కుటుంబాల్లో విషాదం నెలకొందంటూ డెమోక్రాట్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ముఖాముఖీల్లోనూ ఇదే టాపిక్ హైలైట్‌గా నిలిచింది.
అయితే డెమోక్రాట్ల విమర్శలకు దీటుగా జవాభిస్తున్నాడు అధ్యక్షుడు ట్రంప్‌. కరోనా విషయంలో రకరకాల కామెంట్లు చేసి.. చివరకు తనకే కరోనా సోకినా వెనక్కి తగ్గలేదు ట్రంప్‌. తనకు కరోనా రావడం దేవుడి ఆశీర్వాదమని ప్రకటించారు. అంతేకాదు, వైరస్‌ సోకడం వల్లే.. మిలటరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తాను.. కరోనాకు వైద్యులు అందిస్తున్న చికిత్స ఎంత ఉత్తమమైందో తెలుసుకోగలిగానని చెప్పుకొచ్చారు.
అయితే, కరోనా వైరస్‌.. కరోనా వ్యాక్సిన్‌... ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారాయి. కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని.. డెమెక్రాట్స్ విమర్శిస్తుండగా.. కరోనా విషయంలో తనకన్నా ముందు అలర్ట్‌ అయినవారు ప్రపంచంలో ఎవరూ లేరంటూ తనస్టయిల్‌లో కౌంటర్లిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ట్రంప్‌. వైరస్‌ నుంచి కోలుకుని.. వెంటనే మరోరౌండ్‌ ప్రచారానికీ సిద్ధమైపోయారు. మొత్తానికి, కరోనా కల్లోలంలోనే అమెరికా ఎన్నికల ప్రచారం.. జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: