బ్రిటన్‌లో కరోనా సెకెండ్‌ వేవ్ !

NAGARJUNA NAKKA
బ్రిటన్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా ఆసుపత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో మళ్లీ అక్కడ ఆందోళన మొదలైంది.
బ్రిటన్‌లో కరోనా సెకెండ్‌ వేవ్‌ మొదలైంది. ఇప్పటికే యాక్టివ్‌ కేసులతో అక్కడ ఆసుపత్రులు నిండిపోయాయి. ఇప్పడు గత మార్చి లాంటి పరిస్థితులు మళ్లీ మొదలవుతున్నాయని  హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ సంక్రమణ రేటును తెలియజేసే R-నంబర్‌ ప్రస్తుతం 1.2 నుంచి 1.5 వరకు ఉంది. దీని అర్థం పాజిటివ్‌ సోకిన వ్యక్తి నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నట్టు లెక్క.  దీంతో కరోనా నిబంధనల్ని కఠినతరం చేసింది ప్రభుత్వం.
గత మార్చిలో కరోనా దెబ్బకు బ్రిటన్‌ వణికిపోయింది. దీంతో లాక్‌డౌన్‌ విధించాల్సివచ్చింది. తర్వాత వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గినట్టు కనిపించింది. అయితే,  ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల వల్ల కరోనా తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన నిబంధనలను అమలు చేయాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భావిస్తున్నారు. దీనిపై పార్లమెంట్‌లో విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 3-టైర్‌ విధానంలో ఆంక్షలను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైరస్‌ నియంత్రణ చర్యల కోసం స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వడంతో పాటు సోషల్‌ కాంటాక్ట్‌పై ఆంక్షలు విధించనున్నారు. వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లను మూసివేయడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా లండన్‌లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి కఠిన ఆంక్షలు అమలు చేయడం అనివార్యమని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే కరోనా నిబంధనలు పాటించని వాళ్లకు భారీగా జరిమానా విధిస్తామని ప్రకటించింది ప్రభుత్వం.
బ్రిటన్‌లో ఇంత వరకూ 6 లక్షల మందికి పైగా కరోనా వచ్చింది. దాదాపు 43 వేల మంది చనిపోయారు. కోలుకున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. యూరప్‌ ఖండంలోనే కరోనా ప్రభావం అత్యధికంగా బ్రిటన్‌పై పడింది. ప్రస్తుతం అక్కడ 4 లక్షలకు పైగా యాక్టీవ్‌ కేసులున్నాయి. దీంతో మరింత అప్రమత్తమైంది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: