పూర్తిస్థాయిలో తెరుచుకున్న మరో ప్రసిద్ధ ఆలయం.!

Suma Kallamadi
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే షట్ డౌన్ అయింది. ఈ క్రమంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. అందులో ఒకటి ప్రఖ్యాత శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైవున్న బాస‌ర ఆల‌యం. దాదాపు ఆరు నెల‌ల విరామం అనంత‌రం పూర్తి స్థాయిలో ఆదివారం ఈ ఆలయం తెరుచుకుంది. క‌రోనా మహమ్మారి కారణంగా ఈ ఆలయం మార్చి 20న మూసి వేసిన సంగతి తెలిసినదే.
ఈ నేపథ్యంలో ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తులు గత ఐదారు నెలలుగా బాసర ఆలయాన్ని మిస్ అయ్యారని, ప్రస్తుతం ప్రభుత్వ సూచనల మేరకు మరలా భక్తులకు మంచి రోజులు వచ్చాయని, ఈ ఫ్రీ లాక్ డౌన్ అనంతరం కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ.. భ‌క్తుల ద‌ర్శ‌నాలు, ఆర్జిత సేవా, అభిషేకం, హ‌ర‌తి, అక్ష‌రాభ్యాసం వంటి ఇత‌ర సేవ‌లను పూర్తిస్థాయిలో ప్రారంభించిన‌ట్లు చెప్పారు.
ఈ క్రమంలో ఆలయ అర్చకులు భక్తులకు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఆల‌యానికి విచ్చేసే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధరించాలి. ఎలాగూ భౌతిక ‌దూరం తప్పనిసరి. ఆలయ ప్రాంగణంలో ఎక్కడా భక్తులు గుమిగూడి ఉండవద్దు. వీలైనంత వరకూ అవసరమైతే తప్ప, చిన్న పిల్లలను తీసుకు రాకూడదు. ఇక గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితులలో ఆలయానికి రాకూడదు. ఒకవేళ వచ్చినా వారికి ప్రవేశం మాత్రం ఉండదు.
ఇకపోతే.. శ్రీ జ్ఞాన సరస్వతి కొలువై వున్న బాస‌ర ఆల‌యం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చాలా అరుదైన హిందూ దేవాలయం. సాక్షాత్తూ ఆ చదువుల తల్లి సరస్వతి దేవే అక్కడ కొలువు దీరి ఉంటుంది. మన దేశంలో ఎన్నో ప్రాంతాల నుండి అక్కడకు భక్తులు విశేషంగా వెళుతూ వుంటారు. చిన్న పిల్లలకు దాదాపుగా ఇక్కడే 'అన్న ప్రాసన' చేయడానికి భక్తులు ఇష్టపడతారు. ఇక్కడి ఆహ్లాద వాతావరణం చూపరులను ఎంతగానో అలరిస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి బాసర ఆలయాన్ని సందర్శించండి. అంతా శుభమే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: