అత్యాచార ఘటనపై రాజకీయ ప్రకంపనలు..!
యూపీలో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, దాడులు ... రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్షం దుమ్మెత్తి పోసేలా చేస్తున్నాయి. తాజా ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. యోగీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది.
హత్రాస్, షాజహన్‌పూర్, గోరఖ్‌పూర్‌లలో ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న అత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.. ప్రియాంక గాంధీ విమర్శించారు. యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయనీ.. మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. తాజా ఘటనకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలని ప్రియాంక డిమాండ్ చేశారు. యువతి ప్రాణాలు బలి తీసుకున్న నాలుగు మానవమృగాలకూ కఠిన శిక్ష విధించాలన్నారు.
యూపీలో జరిగిన దారుణ అత్యాచార ఘటనపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఆ అమానవీయ ఘటన పట్ల దేశంతో పాటు ప్రభుత్వాలు సైతం ఎంతో సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇందుకు కారకులైన వారిని వెంటనే ఉరి తీయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఘటనపై సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా యూపీ అత్యాచార ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడింది. దళిత యువతిని నలుగురు దుర్మార్గులు గ్యాంగ్ రేప్ చేయడంపై కలత చెందిన కంగనా.. రేపిస్టులని బహిరంగంగా కాల్చేయాలని డిమాండ్ చేసింది. ప్రతిఏటా పెరుగుతూ పోతున్న సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి? ఈ ఘటనపై దేశం సిగ్గు పడాలి.. మన కుమార్తెలను కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు అంటూ కంగనా మండిపడింది.
ఈ దారుణ ఘటనపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. హత్రాస్ ఘటన అమానవీయమని, క్రూరత్వానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.