భారత్ లో కరోనా విలయతాండవం..!
భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 90 వేల మార్కును దాటడం వరుసగా ఇది రెండోసారి. అంతకు ముందురోజు కంటే మరో 170 కేసులు అదనంగా నమోదయ్యాయి. సోమవారం ఉదయానికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42 లక్షల 4 వేల 613కు చేరింది. ఈ సంఖ్యతో భారత్ కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసి ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41 లక్షల 37 వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 20 వేల 362 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. ఇప్పటి వరకు 4 కోట్ల 95 లక్షల 51 వేల 507 మందికి టెస్టులు చేసినట్లు ప్రకటించింది ఐసీఎమ్ఆర్.
భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 32 లక్షల మంది కోలుకున్నారు. 8 లక్షల 82 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం రోజున మరో 69 వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77 శాతంగా ఉంది. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సరాసరి వెయ్యి కొవిడ్ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం మరో 1016 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 71 వేల 642 కు చేరింది. కొవిడ్ మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో కొనసాగుతోంది.