మీడియా మంటలు: ఈనాడు ఆ వార్తను తెలంగాణ ఎడిషన్‌లో ఎందుకు దాచింది..?
జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీసీ) మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక -2019 ఆందోళన కలిగిస్తోందంటూ సమగ్ర వివరాలతో ఇంట్రస్టింగ్ కథనాన్ని ఈనాడు ఏపీ ఎడిషన్‌లో ఇచ్చింది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్‌లో రైతులు , వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 54.96 శాతం పెరిగాయని ఈనాడు రాసింది. 2018వ సంవత్సరంలో 664 ఆత్మహత్యలు చోటు చేసుకోగా 2019లో ఆ సంఖ్య 1.029కి పెరిగింది.
ఇక దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్నాటక తర్వాత మూడోస్థానంలో ఏపీ నిలిచిందని ఈనాడు రాసింది. నిరుడు ఇది నాలుగో స్థానంలో ఉండడం గమనార్హమని తెలిపింది. అలాగే ఈ సారి కేవలం కౌలు రౌతుల ఆత్మహత్యలను పరిగణలోకి తీసుకుంటే రెండోస్థానంలో ఉందని ఈనాడు రాసింది. అంత వరకూ బాగానే ఉంది.
మరి ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణలో ఎలా ఉందన్న అనుమానం సహజంగానే పాఠకులకు కలుగుతుంది కదా.. కానీ ఆ విషయాన్నే ఈనాడు ప్రస్తావించేలేదు. జాతీయ క్రైమ్ బ్యూరో నివేదికలో అన్ని వివరాలు ఉంటాయి. కానీ అసలు తెలంగాణ ఊసే ఎత్తలేదు. మరి ఈ వార్త ఈనాడు తెలంగాణలో ఇచ్చారా అంటే అదీ లేదు. అదేంటబ్బా.. అని మళ్లీ మళ్లీ వెదికితే ఈనాడు తెలంగాణ ఎడిషన్‌లో ఒక మూలన పురుషుల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ అంటూ ఆ కోణంలో ఓ చిన్నవార్త రాశారు.
మరి ఇంతకీ ఆంధ్రజ్యోతి ఏమి ఇచ్చిందా అని చూస్తే.. రైతు ఆత్మహత్యల్లో 5వ స్థానంలో తెలంగాణ!అనే శీర్షికతో మొదటి పేజీలో ఇండికేషన్ ఇచ్చి...లోపలి పేజీలో వివరాలు ఇచ్చారు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం... రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. 2019లో 499 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరి మూడో స్థానంలో ఉన్న ఏపీలో ఈ వార్త మొదటి పేజీలో వస్తే.. ఐదో స్థానంలో ఉన్న తెలంగాణలో ఈవార్త కనీసం ఐదో పేజీలో అయినా రావాలి కదా..?