పరీక్షల వాయిదాకు ప్రతిపక్షాల డిమాండ్ !
కరోనా విజృంభిస్తున్న సందర్భంగా జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే పరీక్షలను వాయిదా వేసేది లేదని ఇదివరకే సుప్రీం స్పష్టం చేసిన తరుణంలో.. మరోసారి సమీక్షించాలని కోరాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న పశ్చిమబెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్గడ్, పంజాబ్, మహారాష్ర్ట సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. పరీక్షలు వాయిదా వేయాలని విపక్ష సీఎంల సమావేశంలో ముఖ్యమంత్రులు కేకంద్రాన్ని కోరారు. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని కూడా అనుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే సుప్రీం తలుపు తట్టారు.
అయితే పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో కొట్టివేసింది. ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని కోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఇప్పుడు విపక్షాల పిటిషన్ పై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.
ఎంట్రన్స్ టెస్టులపై విద్యార్థులతో చర్చించి ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి సూచించారు. అటు యూపీ, బీహార్, గుజరాత్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి రవాణా ఏర్పాట్లు చేస్తానని లాక్ డౌన్ హీరో సోనూ సూద్ ముందుకొచ్చారు. మొత్తానికి బీజేపీయేతర పార్టీలు ఓవైపు.. అధికార పార్టీ మరోవైపు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తానేం చెప్పిందో అదే పాటిస్తోంది. పరీక్షల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.