కరోనా వైరస్ షాక్ నుంచి ఇప్పట్లో కోలుకోలేమా....?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కరోనా మహమ్మారి కట్టడి కోసం చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయని... ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు చాలా సమయం పడుతుందని చెప్పాయి. కరోనాకు ప్రస్తుతం మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని... అందువల్ల ఉద్దీపన చర్యలను ఉపసంహరించడం చాలా ముఖ్యమని ఆర్బీఐ స్పష్టం చేసింది.
మే, జూన్ నెలల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు అమలు చేయడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని జులై, ఆగస్టు నెలలలో కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ నెమ్మదించాయని తెలిపింది. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగనుందని ఆర్బీఐ పేర్కొంది. మహమ్మారితో పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని ఆర్బీఐ నివేదికలో వ్యాఖ్యానించింది.
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కరోనా, లాక్ డౌన్ వల్ల భారీగా క్షీణించాయని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధికి అవసరమైన మూలధన వ్యయాన్ని ఖర్చు చేసే పరిస్థితిలో లేవని పేర్కొంది. కేంద్రం ఆదాయం తగ్గిన నేపథ్యంలో పన్ను ఎగవేతదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై కేంద్రం దృష్టి పెట్టడంతో పాటు పన్ను వసూళ్లు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. నిపుణులు సైతం కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చినా వైరస్ ప్రభావం చాలా సంవత్సరాల పాటు మనపై ఉంటుందని చెబుతున్నారు.