గవర్నర్ తో వైసీపీ ఎంపీ భేటీ ? మండిపడ్డ టీడీపీ ?

ఏపీ అధికార పార్టీ వైసిపి రాజకీయంగా ఏ చిన్న అడుగు వేసినా, దానిపై విమర్శలు చేసేందుకు కాచుకొని కూర్చున్నట్లుగా వ్యవహరిస్తోంది టిడిపి అనే విమర్శలు కొంత కాలంగా వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే టీడీపీ నాయకులూ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కావడంతో టిడిపి నేత వర్ల రామయ్య అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, అనేక ప్రశ్నలు సంధించారు. విజయసాయిరెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా, ఏ 2 గా ఉన్నారని, ఆయన గవర్నర్ ను కలవడం ఏంటి అంటూ ప్రశ్నించారు.

 
ఈ సమావేశానికి ఇంటలిజెన్స్ చీఫ్ ఎలా వెళ్లారని అనుమానం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కలిసి వెళ్లడంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని వర్ల చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా ఈ సమావేశంపై వర్ల రామయ్య అనేక ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా విషయంపై చర్చించేందుకు గవర్నర్ దగ్గరకు సీఎం లేదా మంత్రులు వెళ్లాలి కానీ, రాజ్యసభ సభ్యుడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ ఇద్దరు కలిసి వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.


 ఈ  విమర్శలపై వైసిపి పెద్దగా స్పందించలేదు. అయితే  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం విజయసాయిరెడ్డి తో భేటీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కానీ అందులో మరే వివరాలు ప్రస్తావించలేదు. కాగా.. విజయసాయిరెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి ఏ విషయంపై గవర్నర్ తో భేటీ అయ్యారు అనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోంది.దీనిపై అధికారికంగా వైసీపీ ప్రకటన విడుదల చేసే వరకు ఈ భేటీకి సంబందించిన ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: