జాక్ పాట్ కొట్టిన బావ బావమరిది... రూ.1.8 కోట్ల విలువైన పసిడి ముద్దలు సొంతం...?

Reddy P Rajasekhar
అదృష్టం ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో తెలీదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మన కష్టంతోనే అదృష్టం సొంతమవుతుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో బంగారం కోసం వెళ్లిన బావ బావమరిది నక్క తోక తొక్కారు. కోరుకున్న విధంగానే బంగారం అన్వేషణలో సఫలమయ్యారు. ఏకంగా 1.8 కోట్ల రూపాయల విలువైన పసిడి ముద్దలు వాళ్లకు దొరికాయి. 3.5 కిలోల బరువైన రెండు పసిడి ముద్దలు దొరకడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
అమెరికన్ కరెన్సీ ప్రకారం ఈ బంగారు ముద్దల విలువ 2.5 లక్షల అమెరికన్ డాలర్లు కాగా మన దేశ కరెన్సీ ప్రకారం 1.8 కోట్ల రూపాయలు. ఆస్సీ గోల్డ్ హంటర్స్ డిస్కవరీ ఛానల్ లో నిన్న విక్టోరియాలోని తర్నగుల్లా ప్రాంతంలో లభ్యమైన బంగారం గురించి ప్రసారం చేశారు. ఇథన్ వెస్ట్, బ్రెంట్ షాన్నొన్ ఇద్దరు బావ బావమరిదులు బంగారం అన్వేషణకు వెళ్లిన కొద్ది గంటల్లోనే గుర్తించారు. అక్కడి సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అయింది.
 
ఇథన్ వెస్ట్ తండ్రి పాల్ వెస్ట్ వీరిద్దరికికీ తన వంతు సహకారం అందించి బంగారం పొందడానికి సహాయం చేశాడు. బంగారం కోసం బావ బావమరిది అప్పటివరకు ఎవరూ వెళ్లని ప్రాంతానికి వెళ్లారు. మెటల్ డిటెక్టర్ సహాయంతో ఈ పసిడి ముద్దలను కనిపెట్టినట్టు సమాచారం. పసిడి ముద్దలు అధిక బరువు ఉండటంతో అంచనా వేసిన దాని కంటే 30 శాతం ఎక్కువ లభిస్తుందని ఇథన్, బ్రెంట్ అంచనా వేస్తున్నారు.
 
ఇథన్ వెస్ట్ నాలుగేళ్లుగా బంగారం సేకరణలో ఉన్నాడు. గతంలో అతనికి దొరికనవన్నీ బంగారం చిన్నముక్కలే కావడం గమనార్హం. 2013లో ఇదే ప్రాంతంలో ఒక వ్యక్తికి 5.5 కిలోల బరువైన బంగారం ముద్ద దొరికింది. గడిచిన 170 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బంగారం లభ్యమవుతోంది. మైనింగ్ ఎక్స్ఛేంజ్ గోల్డ్ షాప్ యజమాని కోర్డెల్ కెంట్ టెక్నాలజీని వినియోగించి బంగారాన్ని సులువుగా కనిపెట్టవచ్చని గతంలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: