భారతదేశంలో దక్షిణ, ఉత్తర రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. ఢిల్లీ లో గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు తమ రోజువారీ జీవితాన్ని గడపలేకపోతున్నారు. వరదల కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది.
ఢిల్లీ మహానగరంలో వందల కార్లు, బస్సులు, వాహనాలు వరదల్లో చిక్కుకుపోగా.. కొన్ని కొట్టుకుపోయాయి కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 16 జిల్లాల వ్యాప్తంగా 870 గ్రామాలు భారీ వర్షాల కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల సమయంలో 140 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల కారణంగా సరయు నది నీటిమట్టం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంతో అయోధ్యలోని పురా బజార్ ప్రాంత ప్రజలను వెంటనే పునరావాస ప్రాంతాలకు తరలించారు అధికారులు.
బీహార్ రాష్ట్రంలో కూడా వరుణదేవుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తాజాగా బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల్లో చిక్కుకుపోయి ఇద్దరు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 27 కి చేరుకుంది. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 82 లక్షల మంది ప్రజలు భారీ వర్షాలకు అల్లాడిపోతున్నారు.
మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండగ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందస్తుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. అయితే శుక్రవారం రోజు నుండి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పాల్గర్, రాయ్ గాడ్ లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, జమ్ము కాశ్మీర్ లలో కూడా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి.
కిన్నెరసాని, గోదావరి నదులలో నీటి స్థాయి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగారం-రంగపురం బ్రిడ్జి పై నుండి వాహనదారులు పయనించకూడదని అధికారులను ఆదేశించారు. కేరళలో వర్షాల కారణంగా ఇప్పటికే 63 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెనుగంచిప్రోలు చందర్లపాడు నూజివీడు చల్లపల్లి గుడివాడ మోకాలు లోతు నీటిలో కూరుకుపోయాయి.