గలగలా గోదావరి.. బిరాబిరా కృష్ణమ్మ..!

NAGARJUNA NAKKA
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనుంచి పోటెత్తుతున్న వరదలతో... ఆంధ్రప్రదేశ్ లో జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్ట్‌లు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే శ్రీశైలం జలాశయంలోకి 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ధవళేశ్వరం వద్ద గోదావరి మహోధృతి కొనసాగుతోంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద ఉదృతి కొనసాగుతోంది. 70 గేట్లను రెండు  అడుగుల మేరకు ఎత్తి... నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో లక్షా 45వేల క్యూసెక్ లుగా ఉంటే... ఔట్ ఫ్లో లక్షా 30 వేల  క్యూసెక్ లు ఉంది.
ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సమీక్షించారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు మంత్రి. కృష్ణా బ్యారేజి నుంచి ఇంత వరకూ లక్షా 38 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి.
శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. ఇన్ ఫ్లో  లక్షా 56వేలు 152 క్యూసెక్ లు... ఔట్ ఫ్లో  40వేల 259 క్యూసెక్ లు  ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 871.60 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటి నిలువ సామర్థ్యం 215 టిఎంసీలు కాగా... ప్రస్తుతం  149 టీఎంసీలకు చేరింది.
కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కు తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతుంది. గరిష్ట స్థాయి నీటి మట్టానికి వరద చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.  డ్యామ్ 10 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీళ్ళను కిందకు వదిలారు. తుంగభద్ర డ్యామ్ కు ఇన్ ఫ్లో..27వేల420 క్యూసెక్ లు .. ఔట్ ఫ్లో 27వేల420  క్యూసెక్ లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 100 టీఎంసీలు అయితే ప్రసుత్తం నీటి మట్టం 98 టీఎంసీలకు చేరింది.
పులిగడ్డ ఆక్విడేట్, నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. హంసల దీవి సాగర సంగమం వద్ద కృష్ణమ్మ సముద్రంలోకి చేరుతుంది. పెరుగుతున్న వరద ఉధృతి దృష్ట్యా కృష్ణా నది గర్భ లంక గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. లంకలో గేదెలు మేకలు గొర్రెలు మేపరాదని హెచ్చరించారు. పడవ ప్రయాణాలు నిషేధించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: