విమాన ప్రమాదాలకు రన్ వేలు కారణమా..?
వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కేరళ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఇలాగే ... రన్‌వేను దాటుకొని దూసుకుపోయింది. కింద లోయ ఉండటంతో.. రెండు ముక్కలుగా విరిగిపోయింది. రాత్రి సమయం కావడం.. భారీగా వర్షం కురుస్తుండటంతో రన్ వేను అంచనా వేయడంలో పైలెట్ విఫలమైనట్లుగా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీంతో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి కిందపడి రెండు ముక్కలైంది.
టేబుల్ టాప్ రనే ఉన్న మరో విమానాశ్రయం మంగళూరు ఎయిర్పోర్ట్. ఇక్కడ కూడా గతంలో ప్రమాదం జరిగింది. 2010 మే 22న మంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురైంది. ఈ విమానం రన్ వే పైనుంచి జారీ కిందపడి రెండు ముక్కలయింది. అప్పుడు ఆ విమానానికి మంటలు కూడా అంటుకోవడంతో అందాలోని 158 మంది మరణించారు. కేవలం 8 మంది మాత్రమే బతికి బట్టగట్టారు.
ఇలాంటి రన్ వేలపై పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుత ప్రమాదం కూడా అలాగే జరిగింది. ఇలాంటి టేబుల్ టాప్ రన్ వేలు చూసేందుకు బాగుంటాయి. కానీ ఇక్కడ విమానాలను దింపేందుకు ఎంతో అనుభవమున్న పైలెట్లు అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా... ఇలా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలిసిందే. అందుకే ఈ విమానాశ్రయానికి.. పెద్ద విమానాలైన బోయింగ్ 777, ఏయిర్ బస్ 330 వంటి విమానాలను నడపడం లేదు.
విమానాల ల్యాండింగ్‌కు ఈ ఎయిర్పోర్ట్ ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని వైమానిక రంగ నిపుణులు ఇప్పటికే ఓ నివేదిక అందించారు. కేరళలోని నాలుగు విమానాశ్రయాల్లో అత్యంత తక్కువ రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే. అందుకే ఇక్కడ విమానాల ల్యాండింగ్ సరికాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మరి ఇకనైనా ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ రన్ వే విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి.