రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.... కరోనా ముప్పు ఎంతంటే...?

Reddy P Rajasekhar
భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
 
పేద, మధ్య తరగతి వర్గాలు సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి రైళ్లనే ఆశ్రయిస్తారు. కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. అయితే రైళ్లలో ప్రయాణించే సమయంలో కరోనా సోకే అవకాశం ఎంత...? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? అని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. చైనాకు చెందిన కొందరు పరిశోధకులు క్లినికల్ ఇన్ ఫెక్షియస్ జర్నల్ లో దీనికి సంబంధించిన విషయాలను ప్రచురించారు.
 
ఈ అధ్యయనం ప్రకారం రైలు ప్రయాణాల్లో వైరస్ సంక్రమణ రేటు 0.32 శాతంగా ఉంది. కరోనా సోకిన వ్యక్తిని ఆనుకుని కూర్చుంటే మాత్రం సంక్రమణ రేటు 3.5 శాతం కాగా ఒకే వరుసలో కొద్దిగా ఎడంగా కూర్చుంటే 1.5 శాతంగా ఉంటుంది. కరోనా బాధితుడు కూర్చున్న సీటులో కూర్చుంటే 0.075 శాతం వైరస్ భారీన పడే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు 2334 మంది కరోనా బాధితులపై పరిశోధనలు జరిపి ఈ విషయాలను వెల్లడించారు.
 
60 నిమిషాల ప్రయాణంలో ఒకే వరుసలో కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మధ్య మీటర్ కన్నా ఎక్కువ దూరం ఉంటే కరోనా సోకే ముప్పు తక్కువని పరిశోధకులు చెప్పారు. ఎక్కువసేపు రైళ్లలో ప్రయాణం మంచిది కాదని... ప్రయాణం చేయాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలమని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: