మీడియా మంటలు: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కెలికాడు.. 'నమస్తే' కుమ్మిపారేస్తోంది...?
తెలంగాణలో కరోనా శవాల లెక్కల విషయంలో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం అధికార పార్టీ పెద్దలకు చిరాకెత్తినట్టుంది. ఆ ఆంధ్రజ్యోతి సంగతేంటో చూడండని అధికార పార్టీ పత్రికకు సంకేతాలు వెళ్లినట్టున్నాయి. ఇంకేముంది.. అధికార పత్రిక ఎదురు దాడి మొదలు పెట్టింది. వరుసగా రోజూ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురిస్తోంది.
సాధారణంగా ఒక పత్రికపై మరో పత్రిక ఇలా కథనాలు రాస్తే దానికి ప్రతిగా సదరు పత్రిక జవాబివ్వడం.. ఆ ఎదురుదాడి కొనసాగించడం సాధారణం.. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసింది ప్రభుత్వం నిర్లక్ష్యం మీద. అందుకు అధికార పార్టీ సమాధానం చెప్పుకోవాలంటే.. మీడియా సమావేశం పెట్టి చెప్పుకోవచ్చు. లేదా.. అధికారం చేతిలో ఉంది కాబట్టి తప్పుడు రాతలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.
కానీ ఇక్కడ జరుగుతున్నది మరొకటి.. ఓ పత్రిక కథనంపై మరో పత్రిక వివరణ, ఎదురుదాడి చేయడం అంత మంచిది కాదని ఆంధ్రజ్యోతిని సపోర్టు చేసేవారు అంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం గమనించాల్సి ఉంది. ఆంధ్రజ్యోతి కూడా శుద్ధ పూస ఏమీ కాదు.. అది ఆంధ్రజ్యోతి కాదు.. చంద్రజ్యోతి అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు పత్రికలు ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా ఉంటే.. ఇలాంటి తిప్పలు వచ్చే అవకాశాలే ఉండవు. కానీ ఏం చేస్తాం.. జనం దౌర్భాగ్యం అలా ఉంది. పూర్తిగా ప్రజల పక్షాన ఉండే పత్రికలే కరవై.. పార్టీ పత్రికల కాలం నడుస్తున్నప్పుడు ఇలాంటి లడాయిలు తప్పవు మరి.