కరోనా గురించి ఇదే పెద్ద శుభవార్త... మరో పది రోజుల్లో వ్యాక్సిన్....?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని చెబుతోంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
 
అయితే తాజాగా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ సిద్ధమైందని రష్యా కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 10వ తేదీలోపు కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. రష్యన్ అధికారులు ఈ విషయం గురించి కీలక ప్రకటన చేశారు. రష్యాకు చెందిన గమేలియా ఇన్‌స్టిట్యూట్‌ డెవలప్‌ చేసిన కరోనా వ్యాక్సిన్‌ కు త్వరగా అనుమతులు ఇచ్చి... వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రష్యా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
 
కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన తర్వాత మొదట వైరస్ సోకిన వైద్యులకు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కు వ్యాక్సిన్ ను ఇస్తామని... ఆ తర్వాత ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని రష్యా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే రష్యా వ్యాక్సిన్ గురించి పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా వ్యాక్సిన్ ను తొలి దశ, రెండో దశల్లో ఎంతమందిపై ప్రయోగించారనే విషయం గురించి స్పష్టత లేదని చెబుతున్నారు.
 
ఇప్పటికే యూకే, యూఎస్, కెనడా దేశాలు రష్యన్ వ్యాక్సిన్ గురించి సంచలన ఆరోపణలు చేశాయి. రష్యన్ హ్యాకర్లు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రకటన చేశాయి. వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పకుండా టీకాను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ఫలితం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రష్యా నిజంగానే పది రోజుల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తుందో లేదో చూడాల్సి ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: