ఏపీలో ఆధార్ మాయాజాలం.... 25 సంవత్సరాల యువకుడికి పెన్షన్...?

Reddy P Rajasekhar
ప్రస్తుత కాలంలో ఏ ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ లోని వివరాలే ప్రామాణికం. ఆ వివరాల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. వయస్సును అర్హతగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పథకాలు అమలవుతాయి. అయితే ప్రభుత్వ పథకాలను పొందాలనే ఆశతో చాలామంది ఆధార్ కార్డుల్లో వయస్సు మార్పించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలే అడ్డాగా ఈ మోసాలు జరుగుతున్నాయి.
 
ఏపీలో వృద్ధ్యాప్య పింఛన్ల పథకం, వైయస్సార్ చేయూత పథకంలో అర్హత పొందటానికి కొందరు వయస్సును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఆధార్ నమోదు కేంద్రాలు ఇందుకోసం వసూలు చేస్తున్నాయని తెలుస్తోంది. తాజాగా కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఒక యువకుడు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు.
 
25 ఏళ్ల యువకుడి వయస్సును 60 ఏళ్లకు మార్చారంటే ఆధార్ నమోదు కేంద్రాల దందా ఏ స్థాయిలో సాగుతోందో సులభంగానే అర్థమైంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇప్పటికే వయస్సును మార్పించుకుని అక్రమంగా పింఛన్లను పొందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఈ మోసాలపై దృష్టి పెట్టి అక్రమంగా పింఛన్లు, పథకాలను పొందుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
ఈ రకమైన మోసాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు ఆధార్ కార్డ్ ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఏరియాలైన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మౌర్య ఇన్, బిర్లా గేట్, కోల్స్ కళాశాల తదితర ప్రాంతాల్లో ఈ దందా జోరుగా జరుగుతోందని సమాచారం. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఈ తరహా మోసాలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయి.   





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: