తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లపై కరోనా ఎఫెక్ట్... అన్నీ పరిమితమే....?
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పెళ్లిళ్లపై కరోనా ప్రభావం పడింది. గతంలో ఘనంగా జరిగిన పెళ్లి వేడుకలు కరోనా విజృంభణ వల్ల కొద్దిమందితోనే కానిచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ కరోనా కష్టకాలంలో పెళ్లి చేయాలంటే సవాలక్ష ఆంక్షలు ఉన్నాయి.
వివాహం జరిపించడానికి అధికారుల నుంచి ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. వివాహ వేడుకకు పరిమిత సంఖ్యలో మాత్రమే బంధుమిత్రులు హాజరు కావాలి. ఫలితంగా ప్రతి సంవత్సరం వేలల్లో జరిగే పెళ్లిళ్లు ఈ సంవత్సరం పదులు, వందల సంఖ్యలోనే జరుగుతున్నాయి. పలు ప్రాంతాలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు కుటుంబాల్లో ఎవరో ఒకరికి కరోనా సోకుతూ ఉండటంతో పెళ్లిళ్లు ఆగిపోతున్న పరిస్థితి నెలకొంది.
పురోహితులు జులై చివరి వారం, ఆగస్టు నెలల్లో మంచి మూహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. కరోనా ఆంక్షల వల్ల చాలామంది అతిథుల జాబితాను కుదించి వివాహ వేడుకలను జరిపిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో పెళ్లి హాజరయ్యేవాళ్లు కరోనా పరీక్ష చేయించుకుని వైరస్ సోకలేదని తహశీల్దార్లకు రిపోర్టులు సమర్పించాల్సి ఉంది. పెళ్లికి హాజరయ్యే వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనల వల్ల వధూవరుల కుటుంబాలు తలలు పట్టుకుంటున్నాయి.
మరికొన్ని ప్రాంతాల్లో పెళ్లికి హాజరయ్యే వాళ్లు ఆధార్ కార్డు తీసుకొని రావాలనే నిబంధన అమల్లో ఉంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అమలులోకి వస్తున్న కొత్త నిబంధనల వల్ల వధూవరుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్నో ఊహలతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకోవాలని భావించిన వాళ్లు సైతం కరోనా నిబంధనల వల్ల పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.